Share News

స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం.. పవన్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తమవుతోంది. ఈ మేరకు అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నికల వ్యూహంపై కీలక చర్చ జరిగింది. వివరాల్లోకి వెళితే..

స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం.. పవన్ కీలక ఆదేశాలు
Jana Sena Local Elections

అమరావతి, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తమవుతోంది. ఈ మేరకు అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నికల వ్యూహంపై కీలక చర్చ జరిగింది. శాసనసభ ఎన్నికల సమయంలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. పార్టీ కోసం నిలబడిన జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను గౌరవించేలా ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలు భావించారు. రాష్ట్రంలోని 21 జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. అలాగే ఆయా నియోజకవర్గాలతో పాటు పార్టీకి బలమున్న ఇతర ప్రాంతాలను గుర్తించి స్థానిక ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు.


మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం మంచిదేనని సమావేశంలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లకు సంబంధించి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కూడా సమావేశంలో చర్చించారు. కార్యకర్తలు చెబుతున్న సమస్యలను ఎమ్మెల్యేలు స్వయంగా విని.. వాటి పరిష్కారానికి కృషి చేయాలని పవన్‌ సూచించారు. జనసేన యంత్రాంగం స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ.. పొత్తుల అంశాన్ని తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. ఎవరూ పార్టీ లైన్‌ దాటి మాట్లాడవద్దని నేతలకు.. కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చేలా స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని చూపించాలని జనసేన భావిస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 06:48 PM