చంపడానికి,చావడానికీ సిద్ధపడాలి!
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:23 AM
‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలి. రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తాం’ అని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తన ఇంట్లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను యుద్ధంగా ప్రకటించారు.
అలాంటివారినే ‘స్థానిక’ అభ్యర్థులుగా పెడతాం
రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తాం
కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
కుప్పం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలి. రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తాం’ అని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తన ఇంట్లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను యుద్ధంగా ప్రకటించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీచేసి గెలుస్తామని చెబుతూనే.. వైసీపీ కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండే అభ్యర్థులను సిద్ధం చేస్తామని ఆయన అనగానే వైసీపీ శ్రేణులు చప్పట్లు, కేకలతో రెచ్చిపోయాయి. టీడీపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, పోలీసులు కేసులు పెట్టినా ఒక్కరూ ఉపసంహరించుకోకూడదని ఆయన చెప్పారు. ‘వైసీపీ రూలింగ్‌లో ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు రోడ్డుమీదకు వచ్చిన ఒక్క టీడీపీ నాయకుడి పేరు చెబుతారా? సింహంలాగా బతకడం వేరు. సింహం వేషం వేసుకుని బతకడం వేరు..’ అంటూ టీడీపీని ఎద్దేవా చేశారు. భరత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ప్రశాంతంగా ఉండే కుప్పంలో మళ్లీ అరాచకం సృష్టించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే భరత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తారని తొలుత చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఆయన అరాచకాలు చేశారని.. ఇప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేయడానికి వస్తున్నారని.. ఆయన్ను అడ్డుకుంటామని టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే పెద్దిరెడ్డి కుప్పం పర్యటన రద్దయింది. దీంతో ముందుగా నిర్ణయించిన కల్యాణ మండపానికి బదులు కుప్పంలోని ఎమ్మెల్సీ ఇంటివద్ద సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీ భరత్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కుప్పం టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. కుప్పం అర్బన్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఈ మేరకు ఫిర్యాదు చేశాయి. శాంతిపురం మండల నేతలూ రాళ్లబూదుగూరు పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇలాంటివారు బయట ఉంటే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంటుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి...
బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..
‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’