ఏసీబీ వలలో వారాడ వీఆర్వో
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:32 AM
మండలంలోని వారాడ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. భూమి మ్యుటేషన్ కోసం రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మ్యుటేషన్‌కు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
కె.కోటపాడు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వారాడ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. భూమి మ్యుటేషన్ కోసం రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి మంగళవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని వారాడ శివారు చిరికివానిపాలెం గ్రామంలో బండారు నాయుడుకు చెందిన సుమారు ఐదు సెంట్ల భూమి రీ-సర్వే సమయంలో అతని చిన్నాన్న పేరున నమోదైంది. దీనిని తిరిగి తన పేరున మార్చడానికి, తన చిన్నాన్న అంగీకరిస్తూ ఇచ్చిన పత్రంతో రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. ఎన్ని రోజులైనా మ్యుటేషన్ కాకపోవడంతో వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణను సంప్రదించారు. మ్యుటేషన్ చేయాలంటే రూ.20 వేలు లంచంగా ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని నాయుడు.. ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశారు. అధికారులు చెప్పిన ప్రకారం బండారు నాయుడు మంగళవారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వారాడ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణను కలిశారు. అనంతరం నాయుడు నుంచి సూర్యనారాయణ రూ.20 వేలు తీసుకుంటుండగా సమీపంలో మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో సూర్యనారాయణ నాతవరంలో పనిచేస్తున్నప్పుడు 2022 సెప్టెంబరు 28వ తేదీన రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారని, ఆ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తున్నదని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అప్పట్లో సస్పెండ్ అయిన ఇతను 2024 సెప్టెంబరులో వారాడ వీఆర్వోగా నియమితులయ్యారని చెప్పారు. అంతకుముందు బుచ్చెయ్యపేట మండలం పొట్దిదొరపాలెంలో పనిచేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలపై 2012లో నాలుగు నెలలపాటు ఆ శాఖ అధికారులు సస్పెండ్ చేసినట్టు గుర్తు చేశారు. కాగా వీఆర్వో సూర్యనారాయణపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, బుధవారం విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అదనపు ఎస్పీ హర్షిత తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు సుప్రియ, వెంకటరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు