Irusumanda Gas Blowout: ఎట్టకేలకు అదుపులోకి బ్లోఅవుట్ మంటలు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:58 PM
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ వేల్‌కు బీఓపీ ఫిక్స్ చేసిన ఓఎన్జీసీ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.
అమరావతి, జనవరి 10: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు అదుపులోకి రావటంపై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హర్షం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ వేల్‌కు బీఓపీ (BLOW OUT PREVENTION) ఫిక్స్ చేసిన ఓఎన్జీసీ అధికారులను మంత్రి అభినందించారు. ఓఎన్జీసీ విపత్తు నిర్వహణా బృందం శకలాలను పూర్తిగా తొలగించిందని.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ సిబ్బంది మంటలార్పిందని తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ప్రమాదాన్ని నియంత్రించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన తెలిపారు. కష్ట సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
జరిగింది ఇదీ..
మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో ఈనెల 5న (జనవరి) ఓఎన్జీసీ యాజమాన్యంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దాదాపు 20 మీటర్ల ఎత్తున భారీ అగ్నికీలలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500- 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీని సమన్వయం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు.
మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఓఎన్జీసీ విపత్తు నిర్వహణా బృందం, ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన నిపుణులు, స్థానిక అగ్నిమాపక దళాలు కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. నీటి గొడుగు(Water umbrella), కూలెంట్ ద్రవాలు, డెబ్రిస్ తొలగింపు వంటి చర్యలతో మంటల తీవ్రత తగ్గించారు. చివరకు ఈరోజు (జనవరి 10) ఉదయానికి మంటలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది.
సంబరాలు..
బ్లో అవుట్ అదుపులోకి రావటంతో ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లోఅవుట్ అదుపులోకి రావటంతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఓఎన్జీసీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్ కసిరెడ్డి..
Read Latest AP News And Telugu News