Share News

రాజధానికి రక్షణ కవచం!

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:15 AM

రాజధాని అమరావతి వరద ప్రవాహ దుర్భేద్యంగా మారనుంది. దీనికోసం కృష్ణానది కుడి కరకట్టను ప్రభుత్వం భారీ వ్యయంతో ఆధునికీకరిస్తోంది. వరద ముంపు నుంచి నదీతీర గ్రామాలను రక్షించడానికి సుమారు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కరకట్టను ఇప్పుడు 24 మీటర్ల వరకూ విస్తరిస్తున్నారు.

రాజధానికి రక్షణ కవచం!

  • రద నివారణే లక్ష్యంగా కృష్ణా నది కుడి కరకట్ట విస్తరణ

  • రూ.443 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఈ1 రోడ్డు అభివృద్ధి

  • తొలిసారిగా 1954లో 5.50 మీ. వెడల్పుతో కరకట్ట నిర్మాణం

  • ప్రస్తుతం దీన్ని 24 మీ. వెడల్పుకు పెంచుతున్న ప్రభుత్వం

  • ప్రవాహాన్ని తట్టుకొనే సామర్థ్యం 13.9లక్షల క్యూసెక్కులకు..

(గుంటూరు(రాజధాని)-ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతి వరద ప్రవాహ దుర్భేద్యంగా మారనుంది. దీనికోసం కృష్ణానది కుడి కరకట్టను ప్రభుత్వం భారీ వ్యయంతో ఆధునికీకరిస్తోంది. వరద ముంపు నుంచి నదీతీర గ్రామాలను రక్షించడానికి సుమారు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కరకట్టను ఇప్పుడు 24 మీటర్ల వరకూ విస్తరిస్తున్నారు. ఎంతటి భారీ వరద ప్రవాహం వచ్చినప్పటికీ అమరావతికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనితో పాటు రాజధాని అమరావతి మౌలిక రహదారుల సముదాయంలో భాగంగా కరకట్టను ఈ1 రోడ్డుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులు పూర్తయితే విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రకాశం బ్యారేజీ దిగిన వెంటనే ఈ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో తీర గ్రామాలకు రక్షణగా కుడి కరకట్టను 1954లో నిర్మించారు. మొత్తం 22 కిలోమీటర్ల పొడవు, 18 అడుగుల (5.50 మీటర్ల) వెడల్పున సింగిల్‌ లైన్‌ రోడ్డు ఉండేది. 12లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ కరకట్ట సగటు ఎత్తు సుమారు 4.50 మీటర్లు ఉండేలా నిర్మించారు. జలవనరుల శాఖ తనిఖీ అవసరాలతో పాటు పొలాలు, గ్రామాలను వరదల నుంచి రక్షించడానికి నిర్మించిన ఈ మార్గాన్ని రైతులు పంట రవాణాకూ వినియోగించుకునేవారు.


నాలుగు వరుసల రహదారి

2024లో వచ్చిన వరదల సమయంలో, కృష్ణానదిలో ప్రవాహం 11.43 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. జలవనరుల శాఖ వరదల రికార్డు ప్రకారం, ప్రతి 100 ఏళ్లకు ఒకసారి వరద గరిష్ఠంగా 13.90 లక్షల క్యూసెక్కుల వరకు చేరుకుంటుందని అంచనా వేశారు. కృష్ణానదికి కుడివైపున కరకట్టకు ఆనుకుని రాజధాని నగరం రూపుదిద్దుకుంటోంది. అమరావతిలోని నివాస, పరిపాలనా మౌలిక సదుపాయాలను రక్షించడం, తీవ్ర వర్షపాతం,వరదలను తట్టుకునేలా బలోపేతం చేయడం కోసం 6.90 కిలోమీటర్ల పొడవునా ఉన్న ప్రస్తుత కట్టను నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. అందులో భాగంగా కరకట్ట వెడల్పును 5.5 మీటర్ల నుంచి 24 మీటర్లకు, సగటు ఎత్తును 4.50 మీటర్ల నుంచి 6.00 మీటర్లకు పెంచుతున్నారు. విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి చేరుకునేందుకు కరకట్ట రోడ్డును ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ1 రోడ్డును


నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు.

ముమ్మరంగా పనులు: అమరావతికి ఉత్తరభాగంలో కృష్ణానదికి కుడివైపున 6.90 కి.మీ. కరకట్టను మూడు ప్యాకేజీలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మూడు ప్యాకేజీలకు రూ.443.26 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనావేసి నిధులు విడుదల చేసింది. గత మూడు నెలలుగా కరకట్ట అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. నాలుగు వరుసల రహదారితో పాటు ఫుట్‌పాత్‌లు కూడా నిర్మిస్తారు. ప్యాకేజీ 37 కింద 2.18 కి.మీ మేర రూ.149.82 కోట్లతో, ప్యాకేజీ 38 కింద 2.51 కి.మీ. మేర రూ. 146.47 కోట్లతో, ప్యాకేజీ 39 కింద 2.21 కి.మీ. మేర రూ. 146.97 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. కరకట్ట ఆధునికీకరణలో భాగంగా నిర్ణయించిన గ్రావెల్‌ రాయితో తీరాన్ని బలోపేతం చేస్తున్నారు. దీనితో పాటు ఫ్లెక్సిబుల్‌ పేవ్‌మెంట్లు, నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తున్నారు. అవి పూర్తయిన తరువాత వాకింగ్‌ ట్రాక్‌లు, ప్రజావసరాల కోసం సైన్‌బోర్డులు, స్తంభాలు, బెంచీలు, వీధి దీపాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వరద ప్రవాహాన్ని తట్టుకునేలా బలమైన రాళ్లతో కరకట్టను పటిష్ఠం చేస్తారు. కరకట్ట వాలులపై పచ్చిక పరచడం, నగరం వైపు రక్షణ గోడ, నది వైపు అడ్డుగోడ నిర్మాణం వంటి మొత్తం 10 రకాల పనులు కరకట్ట అభివృద్ధిలో భాగంగా చేపడుతున్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

పండుగ రోజూ కొనసాగిన దీక్షలు

Updated Date - Sep 05 , 2026 | 06:15 AM