శరవేగంగా కాఫీ పల్పింగ్ యూనిట్ పనులు
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:26 PM
మండల కేంద్రంలో కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆరేళ్లుగా అర్థంతంగా నిలిచిపోయిన నిర్మాణాల పూర్తికి కూటమి ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేయడంతో నెల రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. సీజన్ నాటికి కాఫీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.3.5కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
సీజన్ నాటికి పనులు పూర్తి
గిరిజన రైతులకు పెరగనున్న ఆదాయం
గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్ల నుంచి నాణ్యమైన పార్చిమెంట్ ఉత్పత్తికి జీకేవీధిలో ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణానికి రూ.1.3కోట్ల ట్రైకార్ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ పనులను 2021లో ఐటీడీఏ ప్రారంభించింది. 2022 కాఫీ సీజన్ నాటికి ఎకో పల్పింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. అయితే నిధులను వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఆరు నెలల్లోనే పనులను కాంట్రాక్టర్ నిలిపివేశాడు. నాటి నుంచి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విషయాన్ని పలు మార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిచిపోయిన జి.మాడుగుల, జీకేవీధి కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్లు పూర్తికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ రెండు యూనిట్లు పూర్తి చేసేందుకు రూ.3.5కోట్లు చొప్పున రూ.ఏడు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల కావడంతో నెల రోజుల క్రితం అధికారులు పనులను ప్రారంభించారు. ప్రస్తుతం 50శాతం పనులు పూర్తి చేశారు.
కాఫీ ఉత్పత్తిలో జీకేవీధి అగ్రగామి..
జిల్లాలో కాఫీ ఉత్పత్తిలో జీకేవీధి మండలం అగ్ర స్థానంలో ఉంది. మండలంలో రైతులు 42 వేల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. సరైన సేద్య పద్ధతులు పాటించకపోవడంతో ఆశించిన దిగుబడులు రాకపోయినప్పటికీ ప్రతి ఏడాది 4,200టన్నుల క్లీన్ కాఫీ ఉత్పత్తి చేస్తున్నారు. మ్యాక్స్ కాఫీ పండ్లకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నది. జీసీసీ పార్చిమెంట్ చెర్రీని కొనుగోలు చేస్తున్నది. దీంతో రైతులు కాఫీ పంటకు గరిష్ఠ ధరలు పొందుతున్నారు. ప్రస్తుతం కాఫీ పండ్లును చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌కి తరలిస్తున్నారు. ఎకో పల్పింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సేకరించిన కాఫీ పండ్లను వెనువెంటనే ఎకో పల్పింగ్ యూనిట్‌కి తరలించే అవకాశముంటుంది. రైతులకు రవాణా భారం తగ్గుతుంది. రైతులు చెర్రీగా విక్రయించుకోకుండా మెజారిటీ పండ్లను పార్చిమెంట్‌గా విక్రయించుకుని గరిష్ఠ ధర పొందే అవకాశముంటుంది.
సీజన్ నాటికి అందుబాటులో పల్పింగ్ యూనిట్
జి. రఘునాథరావునాయుడు, ఏఈఈ
జీకేవీధిలో నిర్మిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ సీజన్ నాటికి రైతులకు అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సివిల్ పనులు పూర్తి చేసి, పల్పింగ్‌కి అవసరమైన అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తాం.