కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్!
ABN , Publish Date - Sep 07 , 2026 | 04:18 AM
ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పింఛన్ కోసం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 61,92,396 మంది పింఛన్‌దారులు ఉన్నారు.
నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
స్వర్ణగ్రామ, వార్డు కేంద్రాల్లో 16 వరకు అప్లికేషన్లకు చాన్స్
17 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన
24లోగా అర్హుల ఎంపిక పూర్తి
లబ్ధిదారుల తుది ఎంపిక సెర్ప్‌దే
ఈ నెల 26తో ఈ దశ కూడా పూర్తి
అర్హులకు దశలవారీగా పింఛన్లు
రాష్ట్రంలో అర్హులైన వారికి ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్ వర్గాల్లో అర్హులైన కొత్త వారికి ఈ పింఛన్లు అందనున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సోమవారం(సెప్టెంబరు 7) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16లోగా స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియను ఈ నెల 26నాటికి పూర్తి చేయనున్నారు.
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పింఛన్ కోసం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 61,92,396 మంది పింఛన్‌దారులు ఉన్నారు. నెలకు రూ.2,693 కోట్లు ఈ పింఛన్లకు ఖర్చవుతోంది. 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మంది పింఛన్లు పొందుతున్నారు. తాజాగా అర్హులైన వారికి కూడా పింఛన్లు ఇస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కాగా, కొత్త పింఛన్లను నిర్ణీత అర్హత ప్రమాణాల ప్రకారం వివిధ విభాగాలు దశలవారీగా మంజూరు చేస్తాయి. దరఖాస్తుదారు వివరాలు, ధ్రువీకరణ పత్రాలు, సాధారణ అర్హత, ప్రస్తుత పింఛన్‌దారు డేటాబేస్ పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక, ఈ కేవైసీ వివరాల ఆధారంగా ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ దరఖాస్తుదారుల అర్హతను నిర్ణయిస్తారు. జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియను గడువులోగా పూర్తయ్యేలా చూస్తారు. తదుపరి ప్రక్రియ కోసం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులను సెర్ప్ సీఈవోకి పంపుతారు. చేనేత కార్మికుల దరఖాస్తులను రాష్ట్రస్థాయి చేనేత, జౌళి శాఖకు, మత్స్యకారుల దరఖాస్తులను మత్స్యశాఖకు, డప్పు కళాకారులు, చర్మకారుల దరఖాస్తులను సాంఘిక సంక్షేమ శాఖకు, ట్రాన్స్‌జెండర్ దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు, గీతకార్మికుల దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు పంపుతారు.
ప్రతి దశలోనూ పారదర్శకమే!
అర్హత పొందిన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించేందుకు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవల్‌పమెంట్ సెక్రటరీకి పంపుతారు. ఈ అధికారులు దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఈ సందర్భంగా తాము గమనించిన వివరాలను ఫారాల్లో నమోదు చేస్తారు. అలాగే, అవసరమైన వారికి ‘ఈ కేవైసీ’ చేస్తారు.
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అధికారులు తమ లాగిన్‌లలో దరఖాస్తులు, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి ప్రభుత్వానికి పంపుతారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తులను ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్‌కు పంపుతారు. ఒంటరి మహిళల దరఖాస్తులను సంబంధిత తహసీల్దారుకు పంపుతారు. అనంతరం, ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లకు బదిలీ చేస్తారు.
చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్ వర్గాల దరఖాస్తులను వారి లాగిన్‌ల ద్వారా సంబంధిత జిల్లాస్థాయి అధికారులకు సమర్పిస్తారు. వీటిని జిల్లా స్థాయి అధికారి లేదా ప్రత్యేకంగా నియమించిన అధికారి ధ్రువీకరించి లాగిన్లలో వివరాలను అప్‌డేట్ చేస్తారు. అనంతరం.. ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లకు పంపుతారు.
సెర్ప్ ఉత్తర్వులే ఫైనల్!
ఎంపీడీవోలు కేవలం పింఛను దరఖాస్తుదారుల అర్హత/అనర్హతను మాత్రమే నిర్ణయిస్తారు. పింఛన్ మంజూరు చేసే అధికారం వారికి ఉండదు. రాష్ట్రస్థాయిలో ఎస్‌జీఎస్‌డబ్ల్యూ, ఆర్టీజీఎస్, సెర్ప్ సంస్థలు పూర్తిగా పరిశీలించి దరఖాస్తులను ఆమోదిస్తాయి. అనర్హులుగా తేలిన దరఖాస్తుల వివరాలను కారణాలతో సహా ప్రకటన జారీ చేస్తారు. వీటిని గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. దరఖాస్తుదారులకు కూడా వాటిని అందిస్తారు. అలాగే పింఛను అర్హత సాధించిన దరఖాస్తుదారుల వివరాలు కూడా ప్రదర్శిస్తారు. వ్యక్తిగతంగా తెలియజేస్తారు. ఇక, సెర్ప్ తుది ఉత్తర్వులు జారీ చేసిన నెల నుంచి అర్హులకు భరోసా పింఛన్‌ను పంపిణీ చేయనున్నారు.
కావలసిన పత్రాలు:
ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.
వృద్ధాప్య పింఛన్లకు వయో నిర్ధారణ సర్టిఫికెట్. లేదా ఆధార్.
వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్. భర్త ఆధార్.
వివాహిత ఒంటరి మహిళలు విడాకుల సర్టిఫికెట్.
అవివాహిత ఒంటరి మహిళలు తహసీల్దార్ సర్టిఫికెట్.
దివ్యాంగులకు(40 శాతం వైకల్యం) సదరం సర్టిఫికెట్.
చేనేత కార్మికులు జౌళిశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
మత్స్యకారులు మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్.
డప్పుకళాకారులు, చర్మకారులు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన ధ్రువపత్రం.
కల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్.
ట్రాన్స్‌జెండర్లు జిల్లా వైద్య బోర్డు ఇచ్చే ధ్రువపత్రం
ఇదీ.. షెడ్యూల్!
దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబరు 7 నుంచి 16 వరకు.
ఎవరికి ఇవ్వాలి: గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్.
ఈ-కేవైసీ: ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్, ఈ-కేవైసీ తనిఖీ బాధ్యత డిజిటల్ అసిస్టెంట్‌దే.
అర్హత పరిశీలన: స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు, ఆర్టీజీఎస్, సెర్ప్ విభాగాలు చేస్తాయి.
క్షేత్రస్థాయి పరిశీలన: ఈ నెల 17 నుంచి 21లోగా పూర్తి.
అర్హత నిర్ణయం: ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్/జిల్లా/రాష్ట్రస్థాయి అధికారులు.
అర్హత నిర్ణయానికి పట్టే సమయం: ఈ నెల 22-24వ తేదీ వరకు.
తుది ఆమోదం: ఈ నెల 25 నుంచి 26వ తేదీలోగా సెర్ప్ తుది ఆమోదం.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
1) అర్హులైన వ్యక్తులు నిర్దేశిత ఫారాలను స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల నుంచి తీసుకోవచ్చు. అలాగే, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారిక వెబ్‌సైట్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2) వివరాలు నింపిన దరఖాస్తుకు సంబంధిత సర్టిఫికెట్లను జోడించి స్థానిక స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయంలో సమర్పించాలి.
3) డిజిటల్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఈ దరఖాస్తులను స్వీకరించి, ప్రాథమిక వివరాలను సరిచూస్తారు. వాటిని ఎస్‌జీఎస్‌డబ్ల్యూ కొత్త పింఛన్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే దరఖాస్తుదారులకు రసీదు ఇస్తారు.
4) దరఖాస్తుదారు పేర్కొన్న వివరాలను ఈ-కేవైసీ వివరాలతో సరిపోల్చుతారు. వివరాలు సరిపోలితే దరఖాస్తు తదుపరి దశకు వెళ్తుంది. ఒకవేళ తప్పులుంటే దరఖాస్తుదారులకు తెలియజేస్తారు. మరోసారి వివరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
5) 2019, డిసెంబరు 13న ఇచ్చిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ మార్గదర్శకాలు, ప్రస్తుతం ఉన్న పింఛన్‌దారుల డేటాబేస్ ఆధారంగా దరఖాస్తుల అర్హతను పరిశీలిస్తారు. ఈ దశలోనే అనర్హులుగా తేలితే తిరస్కరణ పత్రాన్ని దరఖాస్తుదారులకు అందిస్తారు.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్
వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్