గుడ్ న్యూస్.. ఏపీకి మరో పరిశ్రమ.. శంకుస్థాపన చేసిన లోకేశ్
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:06 PM
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో శంకుస్థాపన చేసిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్.. మారిటైమ్ పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
నెల్లూరు, మార్చి12: సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమ ఏపీకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల స్థానిక మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు లోకేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ వల్ల 25 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఒక వైపు రక్షణ శాఖకు సంబంధించినవి తయారు చేస్తూ.. మరో వైపు మత్స్యకారులకు ఈ సంస్థ సహకారం అందిస్తుందని చెప్పారు. స్వల్ప ఖర్చుతో కూడిన శ్రమతో అధిక ఆదాయం పొందేలా ఈ పరిశ్రమ పని చేస్తుందన్నారు. మత్స్యకారులు చాలా క్రమశిక్షణతో ఉంటారని వివరించారు. గతంలో తాను చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో ఈ గ్రామ ప్రజలు రహదారులను అలంకరించి స్వాగతం పలికారని.. ఇది తన జీవితంలో మరిచిపోలేనని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కారు ఉందన్నారు. నమో.. అంటే నారా చంద్రబాబు, మోదీ అని అభివర్ణించారు. చంద్రబాబు విజనరీ.. హైదరాబాద్ అభివృద్దిలో కీలకంగా వ్యవహరించారని వివరించారు. అందుకే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని చెప్పారు.
ఇదే సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అద్భుతమైన పరిశ్రమ నెల్లూరు జిల్లాకు రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కంపెనీ ఎండీ నికుంజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
For More AP News And Telugu News