నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై కీలక సమావేశం
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:02 PM
నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై కలెక్టరేట్‌లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
నెల్లూరు: కలెక్టరేట్‌లో మత్స్యకారుల సమస్యలపై విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తమిళనాడుకు చెందిన మరబోట్లు మన ప్రాంత మత్స్యసంపదను దోచుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల స్థానిక మత్స్యకారులు నాలుగు మరబోట్లను తమ ఆధీనంలోకి తీసుకుని జువ్వెలదిన్నె హార్బర్‌లో ఉంచినట్లు తెలిపారు. అయితే ఆ బోట్లను కాపలాదారుడు, పెద్దకాపులు విడుదల చేశారని మత్స్యకారులు చెబుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య సమస్య చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పారు. ఒకరోజు రాత్రి పాండిచ్చేరి, కారైకాల్ ప్రాంతాల నుంచి వచ్చిన యజమానులు ఆ బోట్లను తరలించుకుపోయారని వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పారు.
మత్స్యకారుల భద్రత కోసం రెండు ప్రత్యేక స్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేయనున్నట్లు, మెరైన్ పోలీస్ స్టేషన్ల బోట్లను వెంటనే మరమ్మత్తు చేయించనున్నట్లు తెలిపారు. పోలీస్, ఫిషరీస్, మెరైన్, అటవీ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారని, మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు కలెక్టర్ హిమాన్షు శిక్లా, ఎస్పీ అజితా, ఎమ్మెల్సీ బీదా, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కావ్యా కృష్ణారెడ్డి, ప్రశాంతిరెడ్డి, పాశం, విజయశ్రీ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీబీఐ పేరుతో మోసం.. రూ.15.45 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి