Anam Ramnarayana Reddy: కేసీఆర్‌కు నచ్చితే ఎంత?.. నచ్చకుంటే ఎంత?: మంత్రి ఆనం
ABN , Publish Date - Jan 01 , 2026 | 02:51 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలు చూస్తే బాధేసిందన్నారు.
నెల్లూరు, జనవరి 1: కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని... ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం రామనారాయాణ రెడ్డి (Anam Ramnarayana Reddy) స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేయడం బాధేసిందన్నారు. చంద్రబాబు స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్‌కు నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అలాగే దుర్మార్గమైన పనులతో, నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నామని అన్నారు. 2025లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని.. ప్రభుత్వంలో తానూ భాగస్వామిగా ఉండటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
నిన్న ఏడాది చివరి రోజు ఆనందంగా గడిచిపోయిందని... చివరి రోజు కూడా మెరుగైన సేవలు అందించామని చెప్పారు. కొందరు నేతలు, అధినాయకులు సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లాలని చూశారని మండిపడ్డారు. కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఒడి ద్వారా రూ.10,090 కోట్లు పంపిణీ జరిగిందన్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకి రూ.వెయ్యి కోట్లకి పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6310 కోట్లు జమ చేసిందన్నారు. అలాగే దీపం పథకం - 2 ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని.. ఇందుకోసం ప్రభుత్వం రూ.2684 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఎన్‌టీఆర్ భరోసా ఫించన్లకు గత ఏడాది రూ.33 వేల కోట్లు పంపిణీ చేసిందన్నారు. అన్నా క్యాంటీన్లని గత ప్రభుత్వం రద్దు చేసిందని.. పేద, నిరుపేదలకి ఆహారం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల మందికి భోజనాలు అందాయని.. త్వరలో గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక పార్టీలు మాటలు చెబుతూ కాలం గడిపారని మండిపడ్డ మంత్రి.. కూటమి ప్రభుత్వం వర్గీకరణపై చట్టమే చేసి, అమలు చేస్తుందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మందికి ఒకే రోజు ఉద్యోగాలు కల్పించామని.. పోలీసు శాఖలో 5747 ఖాళీలని భర్తీ చేశామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 84 లక్షల టన్నుల చెత్తని వదిలేసి పోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆ చెత్తంతా తొలగిస్తోందన్నారు. ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మత్తులు, రూ.3వేల కోట్లతో నూతన రోడ్ల పనులు చేపట్టిందని అన్నారు. పారిశ్రామిక రంగంలో 23 కొత్త పాలసీలని తెచ్చామని.. ఒక్కో జిల్లాకి ఒక్కో పోర్టు వచ్చేలా ప్రణాళికలు చేసిందని తెలిపారు. వైజాగ్‌లో జరిగిన సమ్మిట్‌లో రూ.13,21,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆశక్తి చూపుతున్నాయని తెలిపారు. ఆగమశాస్త్ర నియమాల మేరకు ఆలయాల్లో పండితులు పూజాదులు నిర్వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఆలయాల్లో చేసిన విధ్వంసం, అపచారాలని సరిచేశామన్నారు. వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయాల నిర్వహణని వైశ్య ప్రముఖులకే అప్పగిస్తున్నామని తెలిపారు. ఆలయాలు ఎకో టెంపుల్ టూరిజం కేంద్రాలుగా మార్పు జరుగుతుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం పనిచేస్తుందని అన్నారు. 492 పురాతన ఆలయాల్లో రూ.590 కోట్లతో పునఃనిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇళ్లులేని పేదలు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరుకి రేపటి నుంచి గ్రీవెన్స్ మొదలవుతుందన్నారు.
సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుల్లో 130 TMCల నీటిని నిల్వ చేశామని.. 7 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీరు అందిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుని తిరుపతి జిల్లాలో కలపాలని చూసిందన్నారు. కూటమి ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుతో పాటు వెంకటగిరిలో మూడు మండలాలను, గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచిందని.. జిల్లాకి పూర్వ వైభవం తెస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దారుణం..
యువకుడిపై కుక్కర్‌తో మూకుమ్మడి దాడి.. ఎందుకంటే?
Read Latest AP News And Telugu News