నెల్లూరులో విషాదం.. దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:38 AM
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం యాకర్లపాడు సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. టైరు పగిలిపోవడంతో అదుపుతప్పిన కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
నెల్లూరు, అక్టోబర్ 9: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతసాగరం మండలం యాకర్లపాడు సమీపంలో టైరు పగిలిపోవడంతో ఓ కారు అదుపుతప్పి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి శ్రీశైలానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా కారు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కారు అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. తీవ్రంగా గాయపడిన నలుగురికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రమాద స్థలంలో విషాదకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు.. క్షతగాత్రుల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తిరుపతి నుంచి శ్రీశైలానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!