Share News

బాడంగిలో పైలట్‌ శిక్షణ!

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:51 AM

భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందిన విజయనగరం జిల్లాకు మరో గుర్తింపు దక్కనుంది. ఎప్పుడో బ్రిటీషు కాలంనాటి బాడంగి ఎయిర్‌ స్ట్రిప్‌ వద్ద పైలెట్‌ శిక్షణ కేంద్రంతో పాటు ఆయుధ డిపో ఏర్పాటు చేసేందుకు భారత నావికాదళం సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.

బాడంగిలో పైలట్‌ శిక్షణ!

  • ఆయుధ డిపో ఏర్పాటుకూ నేవీ రెడీ

  • విజయనగరంలో బాడంగి ఎయిర్‌స్ర్టిప్‌ పరిశీలన

  • ఇప్పటికే 200 ఎకరాలు అందుబాటులో

  • అదనంగా 1550 ఎకరాలు అవసరం

  • రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన

  • ఎయిర్‌స్ట్రిప్‌ పునరుద్ధరిస్తే జిల్లాకు మరో గుర్తింపు

విజయనగరం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందిన విజయనగరం జిల్లాకు మరో గుర్తింపు దక్కనుంది. ఎప్పుడో బ్రిటీషు కాలంనాటి బాడంగి ఎయిర్‌ స్ట్రిప్‌ వద్ద పైలెట్‌ శిక్షణ కేంద్రంతో పాటు ఆయుధ డిపో ఏర్పాటు చేసేందుకు భారత నావికాదళం సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, బాడంగి ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి, రైల్వే మార్గం ఉండడంతో ఈ జిల్లాలోనే దీన్ని ఏర్పాటు చేయాలని నేవీ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల ఆధీనంలో ఉన్న 200 ఎకరాలకుతోడు మరో 1,550 ఎకరాలను నేవీ అధికారులు జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి ఇటీవల పరిశీలించారు. వాస్తవానికి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎయిర్‌స్ట్రిప్‌ పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం కూడా జారీ అయింది. తర్వాత ఎందుకో ఈ అంశం మరుగునపడింది. బ్రిటీషు కాలంలో రక్షణ అవసరాలకు బాడంగి ఎయిర్‌స్ట్రిప్‌ను వినియోగించేవారు. దీన్ని ఇప్పుడు పునరుద్ధరించాలనుకోవడం శుభ పరిణామమే. అదే జరిగితే జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించనుంది.


సుదీర్ఘ చరిత్ర..

బ్రిటీషు కాలంలో ఏర్పాటు చేసిన బాడంగి ఎయిర్‌ స్ర్టిప్‌నకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అప్పట్లో యుద్ధ అవసరాలు, సరుకుల రవాణాకుగాను 227 ఎకరాల్లో రన్‌వే, ఏటీసీ, బంకర్లను సైతం నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఈ ఎయిర్‌ స్ర్టిప్‌ కీలక భూమిక పోషించింది. 1946లో ఈ ఎయిర్‌ స్ర్టిప్‌ను మూసివేశారు. ఆ తర్వాత ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. కొంతకాలం పాటు వరి, గోధుమలను ఇక్కడ నిల్వ చేసేవారు. అనంతరం ఈ భూమి రైతుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ భూముల్లో మామిడి, మొక్కజొన్న, వరి పండిస్తున్నారు.

అక్కడే అనుకూలం..

భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమైన నేపథ్యంలో విజయనగరం జిల్లాపై నేవీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్‌ పోర్టు, 7 కి.మీ దూరంలో జాతీయ రహదారి, 3 కి.మీ. దూరంలో డొంకినవలస రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. దీంతో బాడంగిలో పైలెట్ల శిక్షణతో పాటు ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేవీ ఉన్నతాదికారులు నిర్ణయానికి వచ్చారు. ఇటీవల ఎన్డీఏ, నేవీ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. భూములపై ఆరాతీశారు. ఇప్పటికే ఎయిర్‌ స్ర్టిప్‌నకు చెందిన స్థలంతో పాటు అదనంగా 1,550 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఆ మేరకు ఏపీ ఉన్నతాధికారులకు ఒక నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.


కలిసొచ్చే అంశాలివే..

ఎయిర్‌ స్ర్టిప్‌నకు సంబంధించి భూములను టీ ఆకారంలో సేకరించడానికి అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రధానంగా బాడంగి మండలం ముగడ, మల్లంపేట, పూడివలస, రామచంద్రపురం, కోడూరు పరిధిలో భూముల సేకరణకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. తీర ప్రాంత రక్షణ నేవీ ప్రధాన బాధ్యత. విశాఖ కేంద్రంగా నేవీకి సంబంధించి చాలా కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఆయుధాల డిపోను విశాఖ నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని భావించినట్టు సమాచారం. బాడంగి అందుకు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు ఫైటర్‌ జెట్ల పైలెట్లకు శిక్షణనిచ్చేందుకు కూడా ఈ ప్రాంతం అనుకూలమని గుర్తించారు. అందుకే నేవీ అధికారులు ఇక్కడ ఏర్పాటుచేసేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

ప్రతిపాదనలు నిజమే..

‘బాడంగిలో ఎయిర్‌ స్ర్టిప్‌ను నేవీ అధికారులు పరిశీలించిన విషయం నిజమే. అక్కడ గతంలో కేటాయించిన భూములు రైతుల సాగులో ఉన్నాయి. ఓక వేళ ఇక్కడ పైలెట్ల శిక్షణతో పాటు ఆయుధ డిపో ఏర్పాటు చేస్తామంటే అదనంగా భూమి అవసరమని నేవీ ప్రతిపాదించింది. అయితే అది రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే భూసేకరణకు సిద్ధంగా ఉన్నాం.’

-రామ్మోహనరావు, ఆర్డీవో, విజయనగరం

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 03:51 AM