Share News

అంతా ఆమెకే తెలుసు నాకేం సంబంధం లేదు

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:07 AM

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ ఖాన్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు సోమవారం విచారించారు. అయితే.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా సౌజన్యకే తెలుసని సాదిక్‌ చెప్పినట్టు తెలిసింది.

అంతా ఆమెకే తెలుసు నాకేం సంబంధం లేదు

  • నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ వాదన

  • తొలిరోజు కస్టడీ విచారణలో మౌనం

  • సౌజన్యపైకి నేరం నెట్టే ప్రయత్నం

కాకినాడ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ ఖాన్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు సోమవారం విచారించారు. అయితే.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా సౌజన్యకే తెలుసని సాదిక్‌ చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘‘నూకరాజు కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?. నీ వల్లే చనిపోతున్నట్టు సూసైడ్‌నోట్‌లో నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య ఎందుకు రాశారు?. జగదీశ్‌రెడ్డి మరణం వెనుక నీ హస్తం ఉందని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. అతడికి సైనేడ్‌ వంటి విషపూరిత లిక్విడ్‌ కలిపిన డ్రింక్‌ ఇచ్చి చంపినట్టుగా ఫిర్యాదు చేశారు. దీనిపై నీ సమాధానం ఏంటి?.’’ అని పోలీసులు సాధిక్‌ను ప్రశ్నించారు. అయితే, అతను వాటిలో ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదు. అంతా సౌజన్యకే తెలుసునంటూ నేరం ఆమెపైనే నెట్టే ప్రయత్నం చేశారు. విషపూరిత లిక్విడ్‌ కొనుగోలు చేసింది వాస్తవమేనని, అయితే దానిని తాను ఎక్కడా వాడలేదని చెప్పినట్టు తెలిసింది. 3 రోజుల పాటు జరిగే విచారణలో సాదిక్‌ నుంచి అన్ని విషయాలు రాబట్టి ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తొలిరోజు ఇద్దరు న్యాయవాదులు, కెమెరాల సమక్షంలో జరిగిన విచారణలో సాదిక్‌ను సర్పవరం సీఐ ప్రకాశ్‌ ప్రశ్నించారు. సుమారు 40 ప్రశ్నలు అడిగారు. అయితే, ‘‘నాకేం తెలీదు.. అదంతా అబద్ధం.. నాకసలు సంబంధమే లేదు.’’ అంటూ సాదిక్‌ సమాధానాలు దాటవేశారు.


చదివింది తక్కువ

విచారణ సందర్భంగా ‘నువ్వేం చదువుకున్నావ్‌?’ అని పోలీసులు సాదిక్‌ను ప్రశ్నించారు. దీనికి అతను.. 95 శాతం మార్కులతో డిగ్రీ చదువుకున్నట్టు చెప్పారు. దీంతో తాము తయారు చేసుకున్న ప్రశ్నలను అతని ముందు ఉంచి చదవాలని కోరారు. వాటిని సాదిక్‌ చదవలేక పోవడం.. మరోసారి పోలీసులు ఏం చదువుకున్నావని గద్దించారు. దీంతో తాను పదో తరగతి వరకే చదువుకున్నానంటూ.. అసలు నిజం ఒప్పుకొన్నారు. కాగా, రెండో రోజూ ఏఎస్పీ(అడ్మిన్‌) మహంతి కిశోర్‌ విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’

Updated Date - Sep 09 , 2026 | 05:07 AM