ఖరీఫ్ ఆశలు ఆవిరి
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:05 AM
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ వరి పంటపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి.
- ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
- నీరు లేక జీవం కోల్పోయిన నారుమడులు
- నర్సీపట్నం సబ్ డివిజన్‌లో అంతంత మాత్రంగా నాట్లు
నర్సీపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ వరి పంటపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి. వర్షాలు లేక చాలా చోట్ల నారుమడులు ఎండిపోయాయి. కొన్ని చోట్ల ఇటీవల కురిసిన చిన్నపాటి చినుకులకు నారు పచ్చగా కనిపిస్తున్నా ఆకు దశలో ఉండి పోయింది. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావతంతో నర్సీపట్నం సబ్ డివిజన్‌లోని మాడుగుల, రావికమతం, రోలుగుంట, గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో నామమాత్రంగా వరి నాట్లు పడ్డాయి. దీంతో నర్సీపట్నం సబ్ విడిజన్‌లో వరి సాధారణ విస్తీర్ణం 9,403 హెక్టార్లు కాగా, ఇప్పటికి 1,880 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. రావణాపల్లి రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లో దారుణ పరిస్థితిలు నెలకొన్నాయి. రావణాపల్లి నీటి నిల్వ సామర్థ్యం 132 ఎంసీఎప్‌టీలకు గాను, ప్రస్తుతం 48 ఎంసీఎఫ్‌టీలు మాత్రమే ఉంది. ఇటీవల నీరు వదిలినా ప్రయోజనం కాన రావడం లేదు. గబ్బాడ, నీలంపేట మదుం వరకు నీరు పారుతుంది. మిగిలిన ప్రాంతాలలో ఆయకట్టుకి నీరు చేరే అవకాశం లేదు. రిజర్వాయర్ కింద చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. నర్సీపట్నంలో వరి సాధారణ విస్తీర్ణం 2,443 హెక్టార్లు కాగా, ఇప్పటికి వంద హెక్టార్లు, గొలుగొండలో 1,418 హెక్టార్లకు 90 హెక్టార్లు మాత్రమే నాట్లు పడ్డాయి. రోలుగుంట మండలంలో 1,779 హెక్టార్లకు గాను 15 హెక్టార్లు, రావికమతంలో 2181 హెక్టార్లకు గాను 93 హెక్టార్లలో నాట్లు వేసుకున్నారు. మాడుగులలో 4,000 హెక్టార్లకు గాను 1,582 హెక్టార్లులో వరి నాట్లు పడ్డాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి వీలుగా 80 శాతం రాయితీపై రాగులు, సజ్జలు, పెసలు, మినుములు, తదితర విత్తనాలు సరఫరాకి ప్రతిపాదనలు కోరింది. ఈ నేపథ్యంలో మండలాల వారీగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.