ధరల దరువు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:25 AM
నగరంలో ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. నెలవారీ బడ్జెట్ ఊహించని విధంగా పైకి ఎగబాకుతోంది.
బియ్యం రేట్లు భగభగ
ఇటీవల వరకూ బస్తా (26 కిలోలు) బ్రాండ్‌ను బట్టి రూ.1500-1,600కు విక్రయం
ప్రస్తుతం రూ.1,700-1,800
నూనెలు సలసల
సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ధర గతంలో రూ.150 నుంచి రూ.155...ఇప్పుడు రూ.180
పండ్ల ధరలూ పెంపు
వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. నెలవారీ బడ్జెట్ ఊహించని విధంగా పైకి ఎగబాకుతోంది. నిత్యావసర సరకుల ధరలు అధికమవుతున్నాయి. ప్రభుత్వం దృష్టిసారించినా క్షేత్రస్థాయిలో ఏవీ దిగి రావడం లేదు.
గత రెండు నెలల నుంచి బియ్యం ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హెచ్‌ఎంటీ రకం బియ్యం బస్తా (26 కిలోలు) గతంలో రూ.1,500 నుంచి రూ.1,600కు లభించేది. అందులో లలిత, అక్షయ, బెల్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పుడు అవే రూ.1,750 నుంచి రూ.1,800 పలుకుతున్నాయి. బీపీటీ సన్నాలు రూ.1,600-1,650 మధ్య విక్రయిస్తున్నారు. ఇవి గతంలో రూ.1,500కే దొరికేవి. ప్రస్తుతం అంతా సన్న బియ్యమే వినియోగిస్తున్నారు. దాంతో ధరలు పెరిగినా అమ్మకాలు తగ్గడం లేదు. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయం అధికమైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడంతో వీటి ధరలు ఇంకా పెరుగుతాయని అంటున్నారు. ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉంచడానికి రైతుబజార్లలో బీపీటీ సన్నాలు కిలో రూ.52 చొప్పున విక్రయిస్తోంది. వాటికి కూడా డిమాండ్ బాగానే ఉంది.
నూనెల ధరలు సలసల
వంట నూనె ధర లీటరుకు రూ.20 నుంచి రూ.30 పెరిగింది. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ధర గతంలో రూ.150 నుంచి రూ.155 మధ్య ఉండేది. ఇప్పుడు లీటరు రూ.180 చొప్పున అమ్ముతున్నారు. వేరుశెనగ, నువ్వుల నూనె లీటరు రూ.400కి ఇచ్చేవారు. ఇప్పుడు లీటరు రూ.500 పైబడి విక్రయిస్తున్నారు. వేరుశెనగ గింజల రేటు కూడా కిలో రూ.140 నుంచి రూ.180కి చేరింది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడంతో రైతులు చెరకు సాగు మానేశారు. దాంతో పంచదార ధర ఇటీవల కిలో రూ.85 వరకు పెరిగిపోయింది. నిత్యావసర సరుకులే కాకుండా పండ్ల ధరలు కూడా పెంచి అమ్ముతున్నారు. శ్రావణమాసం కావడంతో అమ్మవారి పూజలు నెలపొడవునా చేస్తున్నారు. పూజలకు అరటి పండ్లు ముఖ్యం. దాంతో వాటి ధర డజను రూ.80 నుంచి రూ.140కి పెంచేశారు. అరటి పంట బాగానే ఉన్నా దళారులు, వ్యాపారులు డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా విధంగా చౌకగా లభించే జామకాయల ధరలు కూడా పెంచేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. రైతుబజార్లలో కిలో రూ.70 నుంచి రూ.80 ధర ఉండగా వారు ఎక్కువ సరకు తేవడం లేదు. దాంతో బయట దళారులు కిలో రూ.120 చొప్పున అమ్ముతున్నారు. ఇలా ధరలన్నీ పెరిగిపోవడంతో సగటు కుటుంబం బడ్జెట్ అనూహ్యంగా పెరిగిపోతోంది.