బంగాళాఖాతంలో ‘మురసు’ తుఫాన్.. ప్రస్తుత పరిస్థితి ఇది..
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:16 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 27 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
అమరావతి, నవంబరు 1: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 27 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్.. ప్రస్తుతం చెన్నైకి 480 కిలోమీటర్లు, నెల్లూరుకు 550 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 560 కిలోమీటర్లు, ఒంగోలుకు 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తుఫాన్ సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
సోమవారం నాడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
వేటకు వెళ్లొద్దు.. మత్స్యకారులకు హెచ్చరిక..
తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలూ చదవండి
రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్