Share News

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యకర్తలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:46 PM

ఆంధ్రప్రదేశ్‌లోని 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే, ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తల తీరుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
AP Municipal Elections

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల వేళ వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు తెరలేపారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు, పోలీసులతో వాగ్వాదాలు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులు, పోలింగ్ కేంద్రాల్లో విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడ్డారు. వైసీపీ శ్రేణుల తీరుతో పోలీసులు, ఓటర్లు, ప్రత్యర్థి పార్టీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.


విజయవాడలో దొంగ ఓట్ల కలకలం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 69వ డివిజన్ ముత్యాలంపాడులో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే ఒకసారి ఓటు వేసిన ఇద్దరు వ్యక్తులు మరోసారి ఓటు వేసేందుకు రావడంతో ఏజెంట్లు వారిని గుర్తించి పట్టుకున్నారు. పోలీసుల విచారణలో వైసీపీ నాయకులే తమను పంపినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆదోనిలో వైసీపీ నేతల వాగ్వాదం

కర్నూలు జిల్లా ఆదోని డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు హంగామా సృష్టించారు. వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, జయ మనోజ్ రెడ్డి నేతృత్వంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు ఉన్నారని, అలాంటిదేమీ జరగడం లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైసీపీ నేతలు గుంపులుగా చేరడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు.


ఎమ్మిగనూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 10వ వార్డులోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్ వర్గీయులు, టీడీపీ అభ్యర్థి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అనంతపురం 45వ డివిజన్‌లో నిలిచిన పోలింగ్

అనంతపురంలోని 45వ డివిజన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఎన్నికల సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాదా కలందర్‌పై దాడి చేసి తల పగలగొట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలపైనా దాడులు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అధికారులు 45వ డివిజన్‌లో పోలింగ్‌ను నిలిపివేశారు. పోలింగ్ అధికారులు ఏజెంట్లతో చర్చలు జరుపుతుండగా.. టీడీపీ అభ్యర్థిపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 45 నిమిషాల పాటు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.


మార్కాపురం వైసీపీ అధ్యక్షుడి అరెస్ట్

మార్కాపురంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే కారణంతో వైసీపీ పట్టణ అధ్యక్షుడు సలీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను నిరసిస్తూ వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు, వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కనకదుర్గ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

తిరుపతి 60వ వార్డులో ఉద్రిక్తత

ఇండిపెండెంట్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ జనసేన శ్రేణులు ఆరోపించాయి. అనుమానాస్పద ఓటర్లను అడ్డుకోవడంతో జనసేన అభ్యర్థి ఆకేపాటి సుభాషిణి, ఆదం సుధాకర్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనను ఓడించేందుకు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ సుభాషిణి ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష..

అనంతపురం 45వ డివిజన్‌లో ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో టీడీపీ నేతలకు గాయాలు

Updated Date - Nov 01 , 2026 | 04:00 PM