Share News

సొంత బాబాయ్‌ను చంపించి.. మా జీవితాలు నాశనం చేశావ్: జగన్ ర్యాలీలో దస్తగిరి వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:57 AM

పులివెందులలో వైఎస్ జగన్‌కు షాక్ తగిలింది. పులివెందుల వీధుల్లో జగన్ చేపట్టిన ర్యాలీకి.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ఎదురుగా వెళ్లి అడ్డుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సొంత బాబాయ్‌ను చంపించి.. మా జీవితాలు నాశనం చేశావ్: జగన్ ర్యాలీలో దస్తగిరి వ్యాఖ్యలు
dastagiri in jagan pulivendula rally

పులివెందుల, నవంబర్ 1: పులివెందుల వీధుల్లో జగన్ చేపట్టిన ర్యాలీలో ఓ ఆకస్మిక సంఘటన చోటుచేసుకుంది. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ర్యాలీకి ఎదురెళ్లాడు.


రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వీధుల్లో ర్యాలీ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ర్యాలీకి ఎదురెళ్లాడు. గమనించిన వైసీపీ అనుచరులు ‘దస్తగిరి వచ్చాడు. దస్తగిరి వచ్చాడు’ అంటూ జగన్‌కు సమాచారం అందించారు. ఇంతలోనే దస్తగిరి జగన్‌ ముందుకెళ్లి ‘సొంత బాబాయ్ వివేకాను చంపించి.. మా జీవితాలు నాశనం చేశావ్’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కంగుతిన్న జగన్ నిశ్చేష్టుడయ్యారు. ఇంతలో దస్తగిరి మరింత ముందుకు వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు నిలువరించి అతడిని పక్కకు పంపారు. ఆపై జగన్.. దస్తగిరిని చూసీ చూడనట్టుగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.


రోడ్ షో కాదు.. ఫ్యాక్షన్ షో: కూటమి నేతలు

పులివెందులలో వైసీపీ అధినేత చేపట్టిన ర్యాలీని కూటమి నేతలు ఆక్షేపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జగన్ చేపట్టిన ర్యాలీ.. రోడ్ షో కాదని..ఫ్యాక్షన్ షో అని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విధ్వంసం సృష్టిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలంటూ కూటమి నేతలు కోరారు.

Updated Date - Nov 01 , 2026 | 12:07 PM