విశాఖ మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక సమీక్ష
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:06 PM
విశాఖలో మున్సిపాలిటీల అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు. చెత్త నిర్వహణ, తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అమృత్ పథకం పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు..
విశాఖపట్నం, ఆగస్టు 22: నగరంలోని మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, VMRDA ఇన్‌చార్జ్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు హాజరయ్యారు. మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అమృత్ పథకం పనుల పురోగతిపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో భారీగా చెత్త పేరుకుపోయిందని మంత్రి నారాయణ ఆరోపించారు. 153 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలేస్తే, ఇప్పటివరకూ 140 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు.
2014-19 మధ్య రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం రెండు ప్లాంట్లు ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.10,200 కోట్లు కేటాయించిందని, ఇందులో ఎలమంచిలికి రూ.24 కోట్లు, నెల్లిమర్లకు రూ.25 కోట్లు, నర్సీపట్నానికి రూ.27 కోట్లు, విజయవాడకు రూ.206 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అమృత్ పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇంటింటికీ మంచినీటి కుళాయిలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి
For More National News And Telugu News