Share News

కక్షసాధింపు రాజకీయాలకు 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:45 PM

మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున నాటి ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అన్యాయంగా అరెస్ట్ చేసిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుర్తుచేశారు.

కక్షసాధింపు రాజకీయాలకు 2024 ఎన్నికల్లో  ప్రజల తీర్పు: ఎంపీ  శ్రీకృష్ణదేవరాయలు
Lav Sri Krishna Devarayalu

ఢిల్లీ, సెప్టెంబర్ 09: మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున నాటి ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అన్యాయంగా అరెస్ట్ చేసిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుర్తుచేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎలాంటి ఆధారాలు లేని కేవలం కల్పిత కేసులను సృష్టించి చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. ఆనాడు జరిగిన ఈ అక్రమ అరెస్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు.


కులం, మతాలకు అతీతంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకం అయ్యారని, న్యాయం, అభివృద్ధి వైపు నిలబడి తమ తీర్పును ఇచ్చారని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. నిజమైన సమస్యలను గుర్తించి, ప్రజలకు మేలు చేసే సంక్షేమానికి ఎప్పుడూ ప్రజల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం జరుగుతున్నాయని తెలిపారు. నూతన పెట్టుబడుల ఆకర్షణతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రూ. 4 వేల పింఛన్ పంపిణీతో పాటు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఇచ్చిన మాటిలో సుమారు 90 శాతం మేర నెరవేర్చినట్లు ఎంపీ తెలిపారు.


రాష్ట్ర సర్వముఖ అభివృద్ధికి సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండటం ఎంతో ముఖ్యమని కృష్ణదేవరాయలు అన్నారు. పదేళ్ల పాటు స్థిరమైన పాలన సాగిన ప్రాంతాలు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మూడేళ్ల క్రితం జరిగిన చంద్రబాబు అరెస్ట్ ఉదంతాన్ని, నాటి పాలనను ప్రజలు మరోసారి గుర్తుచేసుకోవాలని ఎంపీ కోరారు. ఎలాంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే అంశంపై ప్రజల్లో నిత్యం చర్చ జరగాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు బలంగా ఉన్నప్పుడే ప్రజలకు నిజమైన ప్రయోజనం కలుగుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి:

వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్ దేవి సంచలనం

స్టీవ్ వా, రికీ పాంటింగ్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్!

Updated Date - Sep 09 , 2026 | 09:45 PM