Share News

వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్ దేవి సంచలనం

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:17 PM

అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత్ ఆర్చర్లు అద్భుత ప్రదర్శన చేశారు. స్టార్ ఆర్చర్ శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించారు.

వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్ దేవి సంచలనం
Sheetal Devi gold medal

స్పోర్ట్స్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత్ ఆర్చర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో శీతల్‌ విజయం సాధించింది. కజకిస్థాన్‌కు చెందిన ఐజాడా సెయ్దాన్‌ను షూట్‌ఆఫ్‌లో ఓడించిన శీతల్ దేవి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.


ఈ టోర్నమెంట్‌లో శీతల్‌కు ఇది రెండో పతకం. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తోమన్ కుమార్‌తో కలిసి ఆమె ఇప్పటికే కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ భారత జోడీ ఇరాక్‌కు చెందిన సారా అల్ హమీద్, అబ్బాస్ కదిమ్ జోడీని 157-145తో ఓడించి కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పారాలింపిక్ ఛాంపియన్ హర్విందర్ సింగ్ కూడా భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. అలానే భావనతో కలిసి రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్ కియురోంగ్, షియా లెయ్ జోడీని 6-0తో ఓడించింది.


అలానే భావన రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. మరో ఆర్చర్ సరిత కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో చైనాకు చెందిన వాంగ్ హ్యూటింగ్‌పై 141-140తో విజయం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తోమన్ కుమార్ కూడా కాంస్య పతకం సాధించాడు. ఇరాక్‌కు చెందిన అబ్బాస్ కధిమ్‌ను 143-138 తేడాతో తోమన్ ఓడించాడు. ఈ టోర్నీలో తోమన్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం మొత్తంగా ఇవాళ(బుధవారం) భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి, టోర్నీలో పతకాల సంఖ్యను 13కు పెంచుకుంది.


ఇవి కూడా చదవండి:

స్టీవ్ వా, రికీ పాంటింగ్ రికార్డులను బ్రేక్ చేసిన జో రూట్!

50 వేల టికెట్లు సేల్.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లకు హౌస్‌ఫుల్ హంగామా!

Updated Date - Sep 09 , 2026 | 09:34 PM