ఆ గ్రామస్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించండి
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:48 AM
పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామస్థులందరికీ తక్షణం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
బాలిక మృతిపై డిప్యూటీ సీఎం విచారం
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామస్థులందరికీ తక్షణం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఆ గ్రామంలో పంపిణీ చేసిన మలేరియా నివారణా మందులను ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించాలన్నారు. గొల్లగుప్పలో మలేరియా నివారణ మందులు తీసుకున్న 53 మంది అస్వస్థతకు గురైన సంఘటనపై పవన్ ఆరా తీశారు. బాలిక మృతిపై విచారం వ్యక్తంచేశారు. పోలవరం జిల్లా కలెక్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గొల్లగుప్పలో 71 మందికి మలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేయగా, 53 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ వివరించారు. ఓ బాలిక మాత్రలు తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురికాగా, తక్షణం ఆసుపత్రికి తరలించామని, అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి గ్రామంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..