Share News

బీసీ ద్రోహి జగన్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:36 AM

రాష్ట్రంలో బీసీలకు వైసీపీ నేత జగన్‌ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

బీసీ ద్రోహి జగన్‌

  • బీసీ ద్రోహి జగన్‌

  • వైసీపీ హయాంలో బీసీ కోటాలో పది శఆతం కోత

  • మేం 34 శాతం ఇస్తే..అడ్డుకునేందుకు పిటిషన్లు

  • సీదిరి కొడుకు యాదవకులంవ్యక్తిని గుద్ది చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు

  • జగన్‌ బడాచోర్‌..కారుమూరు చోటా చోర్‌

  • గొడ్డలిపార్టీ అరాచకాలు ప్రజలకు తెలపాలి

  • సొంతవాళ్లను చంపి మనపై నెపం వేస్తారు..జాగ్రత్త

  • నరసరావుపేట నియోజకవర్గ సమన్వయ భేటీలో కార్యకర్తలకు మంత్రి లోకేశ్‌ దిశానిర్దేశం

  • డీఎస్సీపై ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌

  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి

‘తెలుగుదేశం పార్టీకి తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్‌ వంటి అనుబంధ విభాగాలున్నాయి. గొడ్డలి పార్టీకి అనుబంధంగా గంజాయి, బూతులు, మహిళా వేధింపుల విభాగాలున్నాయి. మన పార్టీలోకి రెండో తరం, మూడోతరం నాయకత్వం వచ్చింది. వైసీపీలోకి భూకబ్జాలు, హిట్‌ అండ్‌ రన్‌, భార్యను వేధించే నాయకులు వచ్చారు.’’

- మంత్రి లోకేశ్‌


నరసరావుపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బీసీలకు వైసీపీ నేత జగన్‌ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఆ నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీల పట్ల వైసీపీ, జగన్‌ తీరును దుయ్యబట్టారు. ‘‘జగన్‌ నాడు స్థానిక సంస్థలలో బీసీలకు 10శాతం రిజర్వేషన్‌ తగ్గించి, 17 వేల పదవులకు వారిని దూరం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ క్యాబినెట్‌ తీర్మానం చేశాం. వాటిని కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారు. 2019-24 మధ్య బీసీలను అతి కిరాతకంగా వైసీపీ నాయకులు చంపేశారు. తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు రేపల్లెలో అమర్నాథ్‌గౌడ్‌ను కిరోసిన్‌ పోసి తగులబెట్టారు. తోట చంద్రయ్య, నందం సుబ్బయ్యలను దారుణంగా హతమార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్‌ చేసి, పారిపోయాడు. అప్పలరాజు మరొక వ్యక్తిని ప్రవేశపెట్టాడు. చనిపోయింది యాదవ సామాజికవర్గ వ్యక్తి. కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. జగన్‌ బడా చోర్‌ అయితే కారుమూరు నాగేశ్వరరావు చోటా చోర్‌. మద్యం రవాణాలో అక్రమ సొమ్ము కోడలు బ్యాంక్‌ ఖాతాలో కారుమూరు జమచేశారు. ఈ కేసులో ఈడీ ఆయనను జైలుకు పంపితే మనపై నెపం వేస్తున్నారు.’’ అని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సొంత వారిని చంపుకొని టీడీపీపైకి ఆ నేరం నెడుతుందన్నారు. ‘‘సొంత బాబాయిని కిరాతకంగా చంపేసి, మన నాయకుడు చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని రోతపత్రికలో రాశారు. రెంటచింతలలో చెన్నారెడ్డి అనే వ్యక్తి చనిపోతే, ఏపీలో జంగిల్‌ రాజ్‌ అని జగన్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ చెన్నారెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి ఫోన్‌ చేస్తే... గొడ్డలి పార్టీ కార్యకర్తలే తన బిడ్డను చంపారని ఆయన తెలిపారు. గొడ్డలి పార్టీ అరాచకాలన్నింటినీ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది ’’ అని తెలిపారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..


లక్షలాది యువత కలలు నెరవేరుస్తా

‘‘డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. 150 కేసులు వేసినా 150 రోజుల్లో విజయవంతంగా మెగా డీఎస్సీ నిర్వహించి, 16 వేల టీచర్‌ పోస్టులు భర్తీచేశాం. రాబోయే రోజుల్లో మరో మూడు డీఎస్సీలు ఇచ్చి టీచర్‌ పోస్టులు భర్తీ చేసే బాధ్యత నాది. డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్‌తో చర్చకు నేను సిద్ధం. ఆరోపణలు చేసి పారిపోవడం కాదు. వాటిలో వాస్తవాలు ఉంటే ధైర్యంగా నిలబడి నిరూపించాలి. రాష్ట్రంలో గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 పోస్టులు భర్తీచేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. లక్షలాది యువత కలలు నెరవేరుస్తా.’’

చిచ్చుపెట్టే వాళ్ల పట్ల అప్రమత్తత

‘‘తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు పల్నాడుకు ఫ్యాక్షన్‌ ప్రాంతంగా పేరుండేది. కోడెల శివప్రసాద్‌ ఎమ్మెల్యే అయ్యాక ఆ సంస్కృతికి స్వస్తిపలికారు. 2019లో ఓడిపోయినా టీడీపీ నేత అరవిందబాబు కార్యకర్తలకు అండగా నిలబడి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అద్భుతంగా కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం ఉంటుంది. కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. పని చేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది. క్లస్టర్‌, యూనిట్‌ నాయకులకు శిక్షణలో భాగంగా రక్త పరీక్షలు చేయిస్తే, 75 శాతం మందిలో వివిధ వ్యాధులు బయటపడ్డాయి. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తాం. జీవితాంతం వారికి మందులు అందించే బాధ్యత నాది.’’


నో మిస్‌ ఫైర్‌...నో క్రాస్‌ ఫైర్‌

‘‘మరో నెలరోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి పార్టీలను గెలిపించాలి. 2029లోనే కాదు, మరో మూడుసార్లు కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్‌ ఫైర్‌, నో క్రాస్‌ ఫైర్‌. కొందరు రెడ్‌ బుక్‌ అంటే భయపడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని మరోసారి చెబుతున్నాను’’ అని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు

నరసరావుపేట సమీపంలోని కాకాని గ్రామంలోని జేఎన్‌టీయూ-కేలో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్‌ భవనాలను మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్టు చెప్పారు. ‘‘స్టాన్‌ ఫోర్డ్‌ ఎంబీఏ బిజినెస్‌కు పనికిరాగా.. యువగళం పాదయాత్ర రాజకీయాల్లో పనికి వచ్చింది. పాదయాత్రలో వచ్చిన ఆలోచనే 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఇంజనీరింగ్‌ నాలుగేళ్లు చదివిన తర్వాత ఉద్యోగం రావాలి. అందుకే కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం.’’ అని తెలిపారు.

శ్రీ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న లోకేశ్‌

శైవ క్షేత్రం కోటప్పకొండను లోకేశ్‌ సందర్శించారు. శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూర్ణకుంభంతో లోకేశ్‌కు అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం అందించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:36 AM