Share News

మంత్రి చొరవతో 120 ఏళ్ల సమస్యకు చెక్.. 515 కుటుంబాలకు భారీ ఊరట

ABN , Publish Date - May 29 , 2026 | 04:56 PM

గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు గ్రామానికి 120 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన గ్రామం.. 515 కుటుంబాలకు న్యాయం జరిగింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

మంత్రి చొరవతో 120 ఏళ్ల సమస్యకు చెక్.. 515 కుటుంబాలకు భారీ ఊరట
Vatticherukuru Village

అమరావతి, మే 29: ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 120 ఏళ్లుగా కొనసాగుతున్న గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు గ్రామ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సమగ్రంగా పరిశీలించి, శతాబ్ద కాలంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న గ్రామాన్ని ఆ జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామంలోని 515 కుటుంబాలకు భారీ ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే.. క్రీ.శ.1134 నుంచే వట్టిచెరుకూరు గ్రామం ఉనికిలో ఉన్నట్లు వెల్లడైంది. 1931 నుంచే ఈ ఊరు గ్రామపంచాయతీగా కొనసాగుతూ వస్తోంది. గ్రామస్థులు అప్పటి నుంచే పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, 2006లో జరిగిన ఆర్‌ఎస్‌ఆర్‌ నమోదులో పొరపాటున గ్రామాన్ని ‘ఊరి ముందరి చెరువు’గా పేర్కొన్నారు. అనంతరం 2008లో రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ(1)(బి) కింద మొత్తం గ్రామాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు.


దీంతో గ్రామస్థులు తమ భూములను కొనుగోలు, విక్రయాలు చేయలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామస్థుల వినతిపై స్పందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్, సమస్యను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో గ్రామాన్ని పొరపాటున ఊరి ముందరి చెరువుగా నమోదు చేసినట్లు తేలింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి నీటి వనరులు లేవని నివేదికలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ విస్తీర్ణంలో ఉన్న 25.37 ఎకరాలను గ్రామకంఠంగా ప్రకటిస్తూ, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోంది. ప్రజలకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలపై పిటిషన్.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జూన్ 1న డీకే ప్రమాణస్వీకారం.. సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం!

Updated Date - May 29 , 2026 | 06:12 PM