వచ్చిన రోజే ఫైళ్లు క్లియర్ చేయాలి
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:01 AM
మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల వద్దకు వచ్చిన ఫైళ్లన్నీ అదే రోజున క్లియర్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచారని ప్రశంసించారు.
నాతో సహా అందరూ ఆన్‌లైన్‌లోనే వాటిని పంపాలి: సీఎం
మాన్యువల్‌గా పంపడం నేరం.. ఫైళ్ల క్లియరెన్స్‌లో అచ్చెన్న ఫస్ట్
పయ్యావుల, రాంప్రసాద్‌రెడ్డి, ఆనం ఆలస్యం
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల వద్దకు వచ్చిన ఫైళ్లన్నీ అదే రోజున క్లియర్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచారని ప్రశంసించారు. శుక్రవారం కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం సమీక్ష జరిపారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సామర్థ్యానికి ప్రాధాన్యమిస్తూ అచ్చెన్నాయుడు ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాపాన్ని తగ్గిస్తూ, నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ-ఫైలింగ్ వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తున్నారని.. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి, పరిష్కరించడం ద్వారా ప్రత్యేకత చాటుతున్నారని అభినందించారు. ఆయన పనితీరు ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఆలస్యంగా ఫైళ్లు క్లియర్ చేశారని చెప్పారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి ఫైళ్ల క్లియరెన్స్‌కు ఆర్రోజులు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆమె వెంటనే స్పందించి.. సరిదిద్దుకుంటానని హామీ ఇచ్చారు. రెండ్రోజులు.. అంతకంటే తక్కువ సమయంలో పరిష్కరించిన అధికారులందరినీ అభినందించారు. జీరో డేలోనే పూర్తి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 4 రోజుల సమయం తీసుకుంటున్న మంత్రులు వేగంగా క్లియర్ చేయాలన్నారు. ఈ నెల నుంచి తనతో సహా మంత్రులు, అధికారులు ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను క్లియర్ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మాన్యువల్‌గా క్లియర్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అన్ని శాఖలూ ఆన్‌లైన్‌లోకి మారేందుకు నెల గడువిస్తున్నట్లు చెప్పారు. మాన్యువల్ ఫైల్స్ నిర్వహణపై నెలలో నివేదిక ఇవ్వాలని ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు.
ఇంత బరితెగింపా?
సదస్సుకు కొందరు అధికారులు డుమ్మా కొట్టడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ అధికారుల ధైర్యమేంటి.. అంత బరితెగింపు ఎందుకని ప్రశ్నించారు. వారి గైర్హాజరుపై వివరణ తీసుకోవాలని, షోకాజ్ జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. ‘ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ఉండాలి.. 12 గంటలు కాన్ఫరెన్స్‌లో ఉండలేకపోతున్నారా..? చాలా మంది నాన్-సీరియ్‌సగా ఉంటున్నారు. కలెక్టర్ల సదస్సుకు ముందు మంత్రులు సమావేశాలు పెట్టాలి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధంగా ఉండాలి. అంతేతప్ప తూతూ మంత్రంగా వచ్చి ఇక్కడ కూర్చుకుని, ఏదో చెప్పి వెళ్లిపోవవడం కరెక్టు కాదు. నేనే రోజుకు రెండు గంటలు ప్రాక్టీస్ చేసుకుని వస్తాను’ అని పేర్కొన్నారు.
గైర్హాజరైతే సస్పెండ్ చేస్తాం
‘కీలకమైన సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడం కరెక్టు కాదు. ఉదయం చెప్పినా కొంత మంది అధికారులు వినలేదు. పునరావృతమైతే సస్పెండ్ చేస్తాం’ అని సీఎం హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సులో శుక్రవారం ఉదయం ఈ-ఫైల్స్‌పై సమీక్ష సందర్భంగా కొంత మంది అధికారులు ఆయనకు కనిపించలేదు. సీఎస్‌కు కూడా చెప్పకుండా గైర్హాజరయ్యారు. దీనిపై అప్పుడే సీఎం సీరియస్ అయ్యారు. సాయంత్రం శాంతిభద్రతలపై సమీక్ష సందర్భంగా కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. డీ-ఎడిక్షన్ సెంటర్ల నిర్మాణంపై ఆరా తీసేందుకు ఆరోగ్య కార్యదర్శి వీరపాండియన్ ఎక్కడని సీఎం అడిగారు. జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ సమాధానమివ్వడంతో కూల్ అయ్యారు. తర్వాత అక్రమ మందులు అమ్మకాలను కట్టడి చేయాలని ఏలూరు ఎస్పీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అలానే తమ జిల్లాల్లో చాలా మందుల షాపుల్లో మత్తు మందులు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం వెంటనే డ్రగ్స్ డీజీ ఎక్కడని ప్రశ్నించారు. ఆయన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని సీఎ్‌సను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..