విద్యార్థుల హాజరులో ముందంజ
ABN , Publish Date - Sep 11 , 2026 | 10:57 PM
అల్లూరి జిల్లాలో విద్యాభివృద్ధిలో భాగంగా పాఠశాలలకు విద్యార్థుల హాజరు 88.86 శాతంతో ముందంజలో ఉంది.
88.86 శాతం అటెండెన్స్
పీజీఆర్‌ఎస్‌లో వెనుకంజ
64 శాతం అసంతృప్తి
వాట్సాప్ గవర్నెన్స్, పీఎం సూర్యఘర్ అమలులోనూ వెనుకబాటు
జిల్లా కలెక్టర్ల 8వ సదస్సులో గణాంకాలు వెల్లడి
పాడేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
అల్లూరి జిల్లాలో విద్యాభివృద్ధిలో భాగంగా పాఠశాలలకు విద్యార్థుల హాజరు 88.86 శాతంతో ముందంజలో ఉంది. జిల్లాలో అధిక సంఖ్యలో ఆశ్రమ పాఠశాలలుండడంతో విద్యార్థుల గైర్హాజరుకు అవకాశాలు తక్కువగా ఉండడంతోనే హాజరు శాతం అధికంగా ఉండడానికి కారణమని తెలుస్తున్నది. అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సదస్సు రెండో రోజు శుక్రవారం జిల్లాల వారీగా వివిధ రంగాల్లో పురోగతి, ప్రభుత్వ శాఖల పనితీరుపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు గణాంకాలను వెల్లడించారు. జిల్లాలోని విద్యారంగాన్ని సంబంధించి అకడమిక్ స్టార్ రేటింగ్‌లో వెనుకంజలో ఉండడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 2016 విద్యాలయాలకు 1,622 పాఠశాలలు 3 స్టార్ లోపు ఉండగా 379 స్కూళ్లు 3 స్టార్‌లో.. కేవలం 15 స్కూళ్లు మాత్రమే 4 స్టార్‌లో ఉండగా.. ఫైవ్‌స్టార్‌లో ఒక్క స్కూల్ లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితులు జిల్లాలోని విద్యాశాఖ పనితీరును స్పష్టం చేస్తున్నది. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా 71,468 మంది రిజిస్టర్ చేయగా, స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా 120 వివిధ రకాల శిక్షణలు అందించారు. అలాగే 4,669 మంది నైపుణ్యం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో 1,144 మంది వినియోగదారులు సోలార్ రూప్‌టాప్‌కు నమోదు చేసుకోగా 230 మందికి సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. అలాగే 191 ప్రభుత్వ భవనాలకు సోలార్ విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. సూపర్‌సిక్స్ అమలులో భాగంగా స్త్రీశక్తి ఉచిత బస్సు పథకంలో జిల్లాలో 24 లక్షల 59 వేల మంది మహిళలు లబ్ధి పొందగా, దివ్యాంగ శక్తిలో 10 వేల మంది దివ్యాంగులు, ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా 4,217 మంది డ్రైవర్లు లబ్ధిపొందారు. పచ్చదనం పెంపులో భాగంగా అనంత అరణ్య ప్లాంటేషన్ కార్యక్రమంలో 18,900 మొక్కలకు గానూ ఇప్పటికి 7,255 మొక్కలను నాటారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 8,791 మంది సభ్యులకు రూ.57 కోట్ల 95 లక్షలు బ్యాంకు లింకేజీ కల్పించగా, మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడంలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. జిల్లాలోని 6,326 మంది మహిళలకు గానూ కేవలం 635 మందిని మాత్రమే మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు. పీ4లో భాగంగా 80 వేల మంది బంగారు కుటుంబాలు, 63 వేల మంది మార్గదర్శిలను గుర్తించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహణలో జిల్లా వెనుకంజలో ఉంది. పీజీఆర్‌ఎస్‌లోని అర్జీల పరిష్కారంలో కేవలం 36 శాతం మాత్రమే ప్రజలు సంతృప్తిగా ఉండగా.. 64 శాతం అసంతృప్తితో ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వాట్సాప్ గవర్నెస్స్‌లోనూ జిల్లా వెనుకబడి ఉంది. ఈ ఏడాది మే నెలలో వాట్సాన్ గవర్నెస్‌లో 13,903 మంది నమోదుకాగా జూన్ నెలలో 4,325, జూలైలో 3,824, ఆగస్టులో 2,506 మంది మాత్రమే నమోదయ్యారు.