చెక్ పోస్టులు రద్దయినా ఆగని వసూళ్లు.. అర్ధరాత్రి ప్రమాదం..
ABN , Publish Date - May 15 , 2026 | 09:35 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
తిరువూరు, మే 15: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. బజాజ్ షోరూం సమీపంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆపి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అధికారుల తీరుపై స్థానిక వాహనదారులు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఓ (RTO) చెక్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, తిరువూరులో మాత్రం బ్రేక్ ఇన్‌స్పెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో తనిఖీలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనిఖీల పేరుతో వాహనాలను రోడ్డుపై నిలిపివేసి, పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలోనే రహదారిపై వాహనాలు నిలిచి ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వారు మండిపడుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించడం వల్ల ప్రయాణికులు, డ్రైవర్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమ తనిఖీలకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News