తల్లి తాగొద్దు అన్నదని.. తండ్రి నవ్వాడని
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:25 AM
ఎందుకురా తాగుతున్నావు? ఇలా ఎంతకాలం తాగి పెళ్లాం, పిల్లల్ని కష్టపెడతావు’ అని తల్లి కొడుకును మందలించింది.
గొంతు కోసి నాన్నను చంపిన కొడుకు
స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు.. చిత్తూరు జిల్లాలో ఘటన
పెనుమూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘ఎందుకురా తాగుతున్నావు? ఇలా ఎంతకాలం తాగి పెళ్లాం, పిల్లల్ని కష్టపెడతావు’ అని తల్లి కొడుకును మందలించింది. ‘వాడికి నువ్వు ఎంత చెప్పినా మారడు’ అంటూ తండ్రి నవ్వాడు. అంతే.. నన్ను చూసి నవ్వుతావా అంటూ కోడి కత్తితో తండ్రి గొంతు కోసి హత్య చేశాడా కొడుకు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లె పంచాయతీ మాణిక్యరాయనిపల్లెకు చెందిన చెంగారెడ్డి(62)కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బాలాజీ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి భార్యతో గొడవ పడుతుండటంతో తల్లిదండ్రులు మందలించేవారు. దీంతో ఏడేళ్ల కిందట విడిపోయి పెనుమూరులో భార్యా పిల్లలతో కాపురం ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసవడంతో ఎక్కడ ఆస్తి పోగొడతాడోనన్న భయంతో చెంగారెడ్డి.. ఆస్తినంతా చిన్న కొడుకు పేరుకు మార్చేశారు. దీంతో మూడు నెలలుగా తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం తాగి ఇంటికొచ్చిన భర్త బాలాజీని చూసి భార్య.. అత్తమామలకు ఫోన్ చేసింది. ఫోన్లోనే తల్లి కుమారుడిని మందలించింది. నేనే నేరుగా వస్తానంటూ బాలాజీ.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. ‘ఎప్పుడు మారతావు. తాగి తాగి పెళ్లాం పిల్లల్ని ఏం చేద్దామనుకుంటున్నావు’ అంటూ తల్లి అరిచింది. ఆ మాట విన్న తండ్రి.. ఎంత చెప్పినా వాడు మారడని నవ్వడంతో, మద్యం మత్తులో ఉన్న బాలాజీ ఆగ్రహించాడు. కోడి కత్తితో తండ్రి గొంతు కోసి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..