Share News

నెల రోజుల రేషన్‌ ఏమైంది?

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:40 PM

జిల్లాలోని రేషన్‌ డిపోలు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకే పనిచేస్తున్నాయి. ఆ వ్యవధి దాటిపోతే రేషన్‌కార్డుదారులు సరుకులను పొందలేని పరిస్థితి నెలకొంది.

నెల రోజుల రేషన్‌ ఏమైంది?

- 15 దినాలే ఇస్తున్న డీలర్లు

- అమలు కాని మంత్రి ప్రకటన

- విలేజ్‌మాల్స్‌ ఊసే లేదు

రేషన్‌ డిపోలను ఇకమీదట నెలంతా కొనసాగిస్తాం. వాటిని విలేజ్‌మాల్స్‌గా తీర్చిదిద్దుతాం. బియ్యం, పంచదారతో పాటు ఇతర సరుకులు అందుబాటులోకి తెస్తాం. కొన్ని సంస్థలతో భాగస్వామ్యమై వాటి ఉత్పత్తులను అమ్మేందుకు కసరత్తు చేస్తాం.

- గతేడాది పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రకటన ఇది. కానీ, ఇంత వరకూ అమలు కాలేదు. రేషన్‌ డిపోలు 15 రోజులే పనిచేస్తున్నాయి. విలేజ్‌మాల్స్‌ విషయం కూడా మరుగున పడింది.

బొబ్బిలి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రేషన్‌ డిపోలు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకే పనిచేస్తున్నాయి. ఆ వ్యవధి దాటిపోతే రేషన్‌కార్డుదారులు సరుకులను పొందలేని పరిస్థితి నెలకొంది. దీనితో పలువురు పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నామని గత ఏడాది ప్రకటించింది. రేషన్‌ డిపోలను విలేజ్‌మాల్స్‌గా మారుస్తామని చెప్పింది. నెలంతా తెరిచి ఉంచేందుకు వాటిల్లో ఆర్గానిక్‌ వస్తువులు, పప్పుధాన్యాలు, వంట నూనె, గోధుమ పిండి వంటివి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. కానీ, ఇంత వరకూ అమలు చేయలేదు. కొన్ని సంస్థలను టైఅప్‌ చేసుకొని రేషన్‌ డిపోల ద్వారా ఆయా సంస్థల ఉత్పత్తులను చౌక ధరలకు అమ్మేందుకు కసరత్తు చేస్తామన్నారు. అదీ కూడా జరగలేదు. సరసమైన ధరలకు బియ్యం అదిస్తామని చెప్పి స్థానిక పూల్‌బాగ్‌ సెంటర్‌లో మిల్లర్లతో బియ్యం విక్రయ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు. దాన్ని మూన్నాళ్ల ముచ్చటగా నడిపి మూసేశారు. ప్రస్తుత రేషన్‌ డిపోల్లో ఉచిత బియ్యంతో పాటు అరకిలో పంచదారను రూ.17 చొప్పున విక్రయిస్తున్నారు. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి 35 కిలోల బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి ఇస్తున్నారు.

- గతంలో రేషన్‌డిపోల్లో బియ్యం, పంచదారతో పాటు పామాయిల్‌, కందిపప్పు , గోధుమలు వంటివి కూడా సరఫరా చేసేవారు. ఇప్పుడు బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులకు మాత్రమే పరిమితమైపోయింది. రాగులు కూడా బియ్యం వదులుకుంటేనే ఇస్తున్నారు. కేజీ బియ్యం వదులుకుంటే కేజీ రాగులు ఇస్తారు. గరిష్టంగా మూడు కిలోలు మాత్రమే రాగులు ఇస్తారు. సుమారు ఐదేళ్ల నుంచి కందిపప్పు సరఫరా సక్రమంగా సాగడం లేదు. దీంతో తెలుపు రేషన్‌కార్డుదారులు మార్కెట్‌లో అధిక ధరకు కందిపప్పుతో పాటు అనేక నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. నెలంతా రేషన్‌ డిపోను కొనసాగించి అన్ని రకాల సరకులను అందుబాటులోనికి తెస్తే అటు డీలర్లకు, ఇటు రేషన్‌ కార్డుదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

నెలంతా సరుకులు ఇవ్వాలి

రేషన్‌ డిపోలను నెలంతా కొనసాగిస్తామన్న ప్రభుత్వం హామీని అమలు చేయాలి. అన్ని రకాల నిత్యావసర సరుకులను అందజేస్తే పేద, మధ్యతరగతి వర్గాల వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్‌ పంపిణీ పారదర్శకంగా జరుగుతోంది. వంట నూనె, కందిపప్పు, గోధుమపిండి వంటివి సరఫరా చేయాలి.

-చీమల రాంబాబు, దివ్యాంగుల సంఘం ప్రతినిధి, ఇందిరమ్మకాలనీ, బొబ్బిలి

విలేజ్‌మాల్స్‌తో ప్రయోజనం

రేషన్‌ డిపోలను విలేజ్‌మాల్స్‌గా తీర్చిదిద్దితే అందరికీ ప్రయోజనకరమే. దీనివల్ల నెలంతా డిపోను నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ముఖ్యమైన సరుకులను డిపోల ద్వారా విక్రయిస్తే మాకు కమీషన్‌ కొంత పెరుగుతుంది.

-గౌరు, డిపో డీలరు, బొబ్బిలి

ఆదేశాలు రావాల్సి ఉంది

నెలంతా రేషన్‌ డిపోలను నడపాలన్నదానిపై మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. బొబ్బిలి పట్టణం, మండలంలో 35,285 స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేశాం. పప్పు దినుసులు, వంట నూనె, గోధుమ పిండి, మిలెట్స్‌ వంటి వాటికి డిమాండ్‌ ఉంది. వీటిని రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేస్తే వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రేషన్‌డిపోల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా 1967 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.

-రెడ్డి సాయికృష్ణ, సీఎస్‌డీటీ, బొబ్బిలి

Updated Date - Sep 02 , 2026 | 11:40 PM