చేజింగ్...చేజింగ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:30 AM
తండ్రి సరిహద్దుల్లో కేంద్ర సాయుధ దళంలో ఉద్యోగి! కొడుకు మాత్రం గంజాయికి అలవాటు పడి.. ఏకంగా పోలీసులపైనే రెండుసార్లు కత్తితో దాడి చేశాడు
గంజాయి మత్తులో పోలీసులపై దాడి!
సినీ ఫక్కీ తరహాలో చేజింగ్.. పట్టివేత
విజయవాడ/కంకిపాడు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): తండ్రి సరిహద్దుల్లో కేంద్ర సాయుధ దళంలో ఉద్యోగి! కొడుకు మాత్రం గంజాయికి అలవాటు పడి.. ఏకంగా పోలీసులపైనే రెండుసార్లు కత్తితో దాడి చేశాడు.. కృష్ణా జిల్లా పెనమలూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన అక్కిదాసరి అవినాథ్ ఎంసీఏ చేశాడు. తండ్రి నాగేశ్వరరావు ఐటీబీపీ దళంలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అవినాథ్ చదువుకునే సమయంలోనే గంజాయికి అలవాటుపడ్డాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గంజాయి కోసం వెళ్లాడు. అక్కడి నుంచి గంజాయి తాగుతూ పెనమలూరుకు బయలుదేరారు. సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద కానిస్టేబుళ్లు వాహనాలను ఆపి తనిఖీ చేస్తుండగా.. అవినాథ్ వారిపై కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుకు కిడ్నీ వద్ద గాయమైంది. తర్వాత నలుగురు యువకులు చెల్లాచెదురైపోయారు. అవినాథ్ మాత్రం కేటీఎం బైక్‌పై విజయవాడ వైపు పారిపోతున్నట్టు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. దీనితో తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడికి సమాచారం ఇచ్చారు.
మూడు బృందాలు.. మూడు మార్గాలు
అవినాథ్ నడుపుతున్న బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా చిరునామాను దేవరపల్లి పోలీసులు తెలుసుకున్నారు. గన్నవరం ఇన్‌స్పెక్టర్ బీవీ శివప్రసాద్ ఒక మార్గంలో, కంకిపాడు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ మరో మార్గంలో, దేవరపల్లి పోలీసులు ఇంకో మార్గంలో కాపు కాశారు. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని కోమటిగుంట లాకులు దాటాక డొంక రోడ్డుకు అడ్డంగా అతడి వాహనాన్ని ఆపారు. వెనుక వైపు నుంచి గన్నవరం ఇన్‌స్పెక్టర్ వెంటబడుతుండగా.. మధ్యలో అవినాథ్ ఇరుక్కుపోయాడు. లొంగిపోవాలని ఆదేశించిన పోలీసులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన గన్నవరం కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీను ఛాతీలో పొడిచాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్లు శివప్రసాద్, రవికుమార్ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా అవినాథ్ గంజాయి మత్తులో పోలీసులపైకి కత్తి దూస్తుండడంతో.. అతని కాలుపై మరో రౌండ్ కాల్చారు. కాలికి బుల్లెట్ తగలడంతో పడిపోయిన అతడిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవినాథ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పరిశీలించారు. గన్నవరం ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని