Share News

75 ఏళ్ల వయసులోనూ మోదీ, చంద్రబాబు కష్టపడుతున్నారు

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:49 AM

పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యం కేసులో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక ఆచూకీ తెలియకుంటే కోర్టు ముందుకు వచ్చి మరింత సమయం కోరాలని, అంతేతప్ప సిట్‌ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది.

75 ఏళ్ల వయసులోనూ మోదీ, చంద్రబాబు కష్టపడుతున్నారు

  • బాలిక అదృశ్యం కేసును

  • డీజీపీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు

  • ఆయన చర్యల పట్ల మేం సంతృప్తిగా లేం

  • సిట్‌ ఏర్పాటు కంటి తుడుపు చర్య: హైకోర్టు

  • ఎస్‌జీపీ అభ్యర్థనతో విచారణ 7కి వాయిదా

బాలిక అదృశ్యం కేసును డీజీపీ చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. ఆయన తీరుతో మేం సంతృప్తిగా లేం. డీజీపీతో పాటు సంబంధిత పోలీసు అధికారుల హాజరుకు ఆదేశిస్తే తప్ప మార్పు రాదు. కేసు దర్యాప్తు ఎలా చేయాలో డీజీపీకి మేము చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు.కోర్టులో దాఖలు చేసిన మెమోలో డీజీపీకి బదులు మరొక అధికారి సంతకం పెట్టారంటే కేసును ఆయన ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో స్పష్టమవుతోంది. బాలికను ట్రాప్‌ చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నారో పట్టాభిపురం పోలీసులకు బాగా తెలుసు. డీజీపీ ఆ పోలీసులందరినీ ఓ గదిలో కూర్చోపెట్టి ప్రశ్నిస్తే ఉదయం కల్లా వారిని రప్పించవచ్చు. - హైకోర్టు ధర్మాసనం


అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యం కేసులో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక ఆచూకీ తెలియకుంటే కోర్టు ముందుకు వచ్చి మరింత సమయం కోరాలని, అంతేతప్ప సిట్‌ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. బాలికను కోర్టు ముందు హాజరుపర్చాలని మాత్రమే ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది. డీజీపీ మైండ్‌ అప్లై చేసినట్లు కనిపించడం లేదని పేర్కొంది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో కోర్టు ఆదేశాలు అమలు చేసేది ఇలాగేనా అని నిలదీసింది. సిట్‌ ఏర్పాటు చేయడమంటే కేసును కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టడమేనని పేర్కొంది. డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి సిబ్బందిని పరుగులు పెట్టిస్తే బాలిక ఆచూకీ ఇట్టే తెలుస్తుందని వ్యాఖ్యానించింది. 75, 76 ఏళ్ల వయసులో కూడా దేశ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతుంటే... అదృశ్యమైన బాలిక విషయంలో డీజీపీ ఇలాగేనా స్పందించేది అని ప్రశ్నించింది. ఆయన నుంచి ఈ తరహా స్పందన ఆశించలేదని పేర్కొంది.

ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వాలకు చెడ్డపేరు వస్తుందని తెలిపింది. సిట్‌ ఏర్పాటును కంటి తుడుపు చర్యగా అభివర్ణించింది. సహజంగా సిట్‌ను సీనియర్‌ అధికారులతో ఏర్పాటు చేస్తారని, కానీ డీజీపీ ఏర్పాటు చేసిన సిట్‌లో మెజార్టీ సభ్యులు ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లే ఉన్నారని వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తులో విఫలమైన పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి సిట్‌లో స్థానం కల్పించడం ఏంటని ప్రశ్నించింది. డీజీపీనే స్వయంగా కోర్టుకు పిలిచి వివరణ కోరతామంటూ ఓ దశలో ఆయన హాజరుకు ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. పోలీసుల తరఫున ఎస్‌జీపీ విష్ణుతేజ స్పందిస్తూ.. సోమవారం వరకు గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆలోపు బాలిక ఆచూకీ కనుగొని కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు. దీంతో శాంతించిన జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ జి. తుహిన్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాజ్యంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


ట్రాప్‌ చేసి తీసుకెళ్లాడు: బాలిక తండ్రి

పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జూన్‌ 9 పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టా ద్వారా పరిచయమైన షేక్‌ జాన్‌ సైదా అనే వ్యక్తి ట్రాప్‌ చేసి తన కుమార్తెను తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మూడు నెలలు కావస్తున్నా, తన కుమార్తె ఆచూకీని కొనుగొనడంలో పోలీసులు విఫలమయ్యాయని, ఆమెను కోర్టు ముందు హాజరుపర్చి తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తండ్రి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ధర్మాసనం ఎండగట్టింది. గురువారంలోగా బాలికను కోర్టు ముందు హాజరుపర్చాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. పిటిషన్‌ గురువారం మరోసారి విచారణకు రాగా పోలీసుల తరఫున ఎస్‌జీపీ టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ఏ దశలో ఉందనే విషయంపై సీఐడీ డీజీ నుంచి డీజీపీ నివేదిక తెప్పించుకున్నారన్నారు. బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో డీజీపీ సిట్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. దర్యాప్తు పురోగతి ఆధారంగా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ ద్వారా కోర్టుకు నివేదిక సమర్పించాలని సూచించారన్నారు. సిట్‌ ఏర్పాటుకు సంబంధించి మెమోను కోర్టు ముందు ఉంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. సిట్‌ ఏర్పాటుకు ముందు జిల్లా ఎస్పీ నుంచి కాకుండా సీఐడీ డీజీతో నివేదిక తెప్పించుకోవడం ఏంటి? అసలు సీఐడీకి ఈ కేసుతో సంబంధం ఏంటి? అని ప్రశ్నించింది.


ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 05:49 AM