Share News

నాగమహేశ్ హత్యకేసును ఛేదించిన పోలీసులు.. బావమరిదే హంతకుడు

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:51 PM

తెనాలికి చెందిన వ్యాపారి నాగమహేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో సొంత బావమరిదే బావను హత్య చేయించినట్లు గుర్తించారు.

నాగమహేశ్ హత్యకేసును ఛేదించిన పోలీసులు.. బావమరిదే హంతకుడు

గుంటూరు, సెప్టెంబర్ 3: జిల్లాలోని తెనాలికి చెందిన వ్యాపారి నాగమహేశ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన వ్యాపారి నాగమహేశ్, ఆయన బావమరిది పగడాల రాజేశ్‌కు మధ్య గత కొంతకాలంగా ఆస్తివివాదాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బావ నాగమహేశ్ అడ్డుతొలగించుకోవడానికి బావమరిది రాజేశ్ పథకం పన్నాడు. బావను హత్య చేయించాలని ఓ గ్యాంగ్‌కు రూ.4 లక్షల సుఫారీ చెల్లించాడు. 10 రోజుల పాటు నాగమహేశ్ చుట్టూ రెక్కీ నిర్వహించిన ఆ గ్యాంగ్ ముందుగా ఆయనను కిడ్నాప్ చేసింది. అనంతరం హత్య చేసి సమీప గ్రామమైన ఓలేరులో పాతిపెట్టింది. కిడ్నాప్ కేసు విచారణ సమయంలో బావమరిది రాజేశ్ ప్రవర్తనపై అనుమానమొచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఆయనను విచారించడంతో అసలు నిజం వెలుగుచూసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బావమరిది రాజేశ్‌తో పాటు సుఫారీ గ్యాంగ్‌లో భాగమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 42 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కిడ్నాప్ కోసం వారు ఉపయోగించిన టాటా నెక్సాన్ కారును స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Sep 03 , 2026 | 09:51 PM