జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే చురకలు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:42 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరికొన్ని నెలల అనంతరం పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. ఈ ప్రకటనపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు.
నంద్యాల, జనవరి 29: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలు చేస్తే.. చేసిన పాపాలు ఎక్కడికీ పోవంటూ వైఎస్ జగన్‌కు చురకలంటించారు. పాదయాత్ర చేసినా.. ఆ పాపాలు జగన్ వెంటే ఉంటాయన్నారు. ప్రజలకు ఏం తక్కువైందని మీరు పాదయాత్ర చేయబోతున్నారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి 164 సీట్లు వస్తే అందులో మీ కార్యకర్తలు కూడా తమకు ఓట్లు వేశారని అర్థం చేసుకోవాలని వైఎస్ జగన్‌కు సూచించారు.
ఈ పాదయాత్ర ప్రజల కోసమా? లేకుంటే కార్యకర్తల కోసమా? చెప్పాలని జగన్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యిపై ఫైనల్ ఛార్జ్‌షీట్ సమర్పణ నేపథ్యంలో ఈ రోజు శ్రీశైలం ఆలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు తొలగిపోవాలని మల్లిఖార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించారు.
తిరుమల ఆదాయం ఎక్కువగా ఉండటంతో అక్కడ అక్రమాలు చేశారని.. దేవుడి దయతో శ్రీశైలంలో జరగలేదని పేర్కొన్నారు. కలియుగం అంటే ఇలా ఉంటుందని వైసీపీ వాళ్లను చూస్తే అర్థమవుతోందని వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ వాళ్లకు మంచి బుద్ధితో పాటూ వాళ్లలో మార్పు రావాలని మల్లిఖార్జున స్వామి, అమ్మవార్లను కోరుకున్నామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గీతం యూనివర్సిటీ వద్ద వైసీపీ బృందం నిరసన..
మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..
For More AP News And Telugu News