కొలను భారతి ఆలయ వివాదంపై శ్రీశైలం దేవస్థానం విచారణ
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:54 PM
శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అనుమతులు లేకుండా హోమాలు నిర్వహించడంతో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘనపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆలయ ఈవో శ్రీనివాసరావు స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ, వాస్తవ పరిస్థితులపై పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొలను భారతి ఆలయంలో నిర్వహించిన హోమాలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పాటించలేదనే ఆరోపణలపై విచారణాధికారిగా ఏఈఓ ఫణీధర్ ప్రసాద్‌ను నియమించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి నివేదికను తక్షణమే సమర్పించాలని ఈవో ఆదేశించారు.
దేవస్థానం ఈవో, వైదిక కమిటీ అనుమతి లేకుండా హోమాలు నిర్వహించడాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. దీంతో ఏఈఓ ఫణీధర్ ప్రసాద్ హుటాహుటిన ఆలయానికి చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు సంబంధిత అంశాలపై విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా ఆలయ ముఖ మండపంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన నవచండీ హోమ గుండాన్ని తొలగించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డులోని ఓ సభ్యుడి సహకారంతో కొందరు ఎన్నారై భక్తులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత మేర ఉందనే అంశంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు
'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్