డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:51 PM
కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.
కర్నూలు, ఆగస్టు 18: అసెంబ్లీలో డీఎస్సీ-2025పై చర్చకు రావాలని మంత్రి నారా లోకేశ్ ఆహ్వానిస్తే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన నాయుడు ఎద్దేవా చేశారు. మంత్రి లోకేశ్ సవాల్ స్వీకరించి.. అసెంబ్లీలో చర్చకు రావాలని వైఎస్ జగన్‌కు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు సమీపంలో ఓర్వకల్లులో కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు లోకేశ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అసెంబ్లీకి వస్తే తన కుట్ర బయట పడుతోందనే భయంతో వైఎస్ జగన్.. చర్చకు రావడం లేదన్నారు. కూటమిపై దుష్ప్రచారం చేసి.. తన ఉనికిని కాపాడుకోవాలని వైఎస్ జగన్ చూస్తున్నారని విమర్శించారు. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీచర్లను చూస్తే వైఎస్ జగన్‌కి కోపం, కక్ష అని చెప్పారు.
మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు లేకుండా.. పూర్తి పారదర్శకంగా వేలాది టీచర్ల పోస్టులు భర్తీ చేశామని కేంద్ర మంత్రి వివరించారు. ఏ ప్రభుత్వం చేయని టీచర్ ఉద్యోగాలు.. తాము భర్తీ చేశామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్లలోనే ఏపీలో ఊహించని అభివృద్ధి జరిగిందని రామ్మోహన నాయుడు తెలిపారు.
కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థలకు చెందిన సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ సిటీకి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రానుందని అన్నారు. అన్ని రంగాల్లో ఇప్పుడు డ్రోన్‌ల వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో 6 లక్షల డ్రోన్‌ల అవసరం ఉండగా.. ప్రస్తుతం 40 వేల డ్రోన్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ చూసి.. డ్రోన్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఓర్వకల్లులో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఈ సిటీలో డ్రోన్ల తయారీ, ప్రొడక్షన్, శిక్షణ అన్ని ఉంటాయని వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు. డ్రోన్ శక్తిని వాటి పనితీరును ప్రధాని మోదీ గుర్తించారని చెప్పారు. మన టెక్నాలజీని ఉపయోగించి మనమే డ్రోన్ తయారు చేసి.. విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని గుర్తు చేశారు.
విదేశాల నుంచి డ్రోన్ల దిగుమతిని కేంద్రం నిషేధించిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భారతదేశంలోనే తొలి అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వివిధ డ్రోన్ కంపెనీలతో సమీక్ష నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకోంటామని తెలిపారు. 150 కంపెనీలకు చెందిన డ్రోన్ సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహిచడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్
అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ: నితిన్ నబిన్ ఫైర్
Read Latest AP News And Telugu News