Share News

మీ భూమిపై ఎవ్వరి కన్ను పడకుండా నాదీ రక్షణ: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:41 PM

తాను నాలుగో సారి ముఖ్యమంత్రిని అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.

మీ భూమిపై ఎవ్వరి కన్ను పడకుండా నాదీ రక్షణ: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

కర్నూలు, ఫిబ్రవరి 06: జీవితంలో ఎవరూ మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూ ఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్‌‌లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను నాలుగో సారి ముఖ్యమంత్రిని అయ్యానని.. ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో సైతం పని చేశారని గుర్తు చేశారు.


ఏపీలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్నది తన సంకల్పమని స్పష్టం చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్లాల్సి ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పరిశ్రమలతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. ఓర్వకల్లును తాను అభివృద్ధి చేస్తే.. వాళ్లు సర్వనాశనం చేశారన్నారు. అయినా.. మీ వారసత్వ భూమిపై వైఎస్ జగన్ ఫొటో ఏమిటని రైతులను ఆయన సూటిగా ప్రశ్నించారు. అందుకే రాజముద్రతో కొత్త పుస్తకాలు ఇచ్చి.. మీకు మళ్లీ హక్కు కల్పించానని వివరించారు.


మీ జుట్టు జగన్ తన చేతుల్లో పెట్టుకుని పాలించాడని విమర్శించారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లితే.. ఆయన ఫొటో చూడాలి.. పొలానికి వెళ్లితే ఆయన ఫొటో చూడాలనే విధంగా వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ దుర్మార్గుడి ఫొటో చూడాల్సిన పని ప్రజలకు ఏముందని ఆయన ప్రశ్నించారు. నూటికి 80 శాతం భూ సమస్యలు వస్తున్నాయని విమర్శించారు.


లక్ష ఎకరాల ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూముల రికార్డుల్లో పెట్టారని మండిపడ్డారు. తాడేపల్లె సమీపంలో 10 ఎకరాల ప్రైవేట్ భూమిని హెలిప్యాడ్‌గా మార్చుకున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగడాలను ఈ సందర్బంగా ఎండగట్టారు. 70 ఏళ్ల రికార్డున్న ఆ భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులు మార్చారని తెలిపారు. రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అక్రమాలు, దుర్మార్గాలు చేశారని వైసీపీ అగ్రనేతల ఆగడాలను సీఎం చంద్రబాబు బహిర్గతం చేశారు.


లంచాల వ్యవస్థకు స్వస్తి పలకాలి: సీఎం చంద్రబాబు

ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా మీ భూమిపై కన్నేస్తే జైలుకి వెళ్తారని స్పష్టం చేశారు. ఏ ఒక్క తప్పు ఉన్నా ఆ పట్టాదారు పుస్తకం చించేసి.. సరి చేసి ఇంకో పుస్తకం ఇస్తామని వివరించారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలని ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని తీసుకుని వచ్చామన్నారు. మీకు కాల్ చేసి.. వివరాలు తీసుకుని మార్పులు చేస్తున్నామని తెలిపారు. 91 వేల మంది రైతులకు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అర సెంట్ స్థలం కోసం కుటుంబంలో తగాదాలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదని.. రతనాల సీమ అని అందుకే అన్న ఎన్టీఆర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించారని వివరించారు. రాయలసీమకు నీరు ఇచ్చిన తర్వాతే.. చెన్నైకి ఎన్టీఆర్ నీరు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.


పోలవరానికి శనీశ్వరుడిలా అడ్డుతగిలారు: సీఎం చంద్రబాబు

హంద్రీనీవా, తెలుగు గంగా, గాలేరు- నగరి ప్రాజెక్ట్‌లు అన్న ఎన్టీఆర్ ఇచ్చారన్నారు. అనంతపురాన్ని ఉద్యానవనంగా మారుస్తున్నామని చెప్పారు. రాయలసీమలో ప్రస్తుతం అత్యధికంగా పంటలు పండించేలా నీరు ఇచ్చామన్నారు. భవిష్యత్‌లో సైతం కరెంట్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. తాను సీమ బిడ్డనేనని.. అన్న ఎన్టీఆర్ సైతం సీమ బిడ్డేనన్నారు. వైఎస్ జగన్ ఇప్పుడు వచ్చి రాయలసీమ అంటున్నారని పేర్కొన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పోలవరానికి శనీశ్వరుడిలా అడ్డు తగిలారంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు సీఎం. గోదావరి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇచ్చే 100 టీఎంసీల నీటిని రాయలసీమకు మళ్లించి కరవును తొలగించామన్నారు.


కరవు జిల్లాల్లో కియా కార్లు: సీఎం చంద్రబాబు

కరవు జిల్లాల్లో కియా కార్లు పరుగెత్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అలా సీమను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ప్రపంచానికి రాయలసీమ హార్టికల్చర్ అవుతుందని అభివర్ణించారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఎన్‌జీటీ అనుమతి లేని ప్రాజెక్ట్ తెచ్చి.. తనపై బురద జల్లాలని చూశారంటూ వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర(టీబీ) డ్యాం నీళ్లు కర్నూలు జిల్లా ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఎస్ పూర్తి చేసి.. గుండ్రేవుల కోసం పక్క రాష్ట్రాలతో మాట్లాడి ఒప్పించి నిర్మిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వేదవతి ప్రాజెక్ట్ తానే ప్రారంభించి.. పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


వెంకటేశ్వర స్వామే కాపాడారు: సీఎం చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ చుట్టూ తీవ్రవాదులు ఉండే సమయంలో.. ఆ నగరాన్ని తాను అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. వారికి తాను అడ్డు తగులుతున్నానని తిరుపతిలో తనపై దాడికి దిగారని.. కానీ ఆ వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. బల ప్రదర్శన అనేది ఎన్నికల్లో చూపించుకోవాలని.. మిగతా సమయంలో ప్రజా సేవ చేయాలన్నారు. రాజకీయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాట తీస్తానని వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తాను ఉన్నానని.. కాబట్టే ఇప్పుడు హైదరాబాద్ ,సైబరాబాద్ నగరాలు ఉన్నాయని తెలిపారు. తాను చిత్రగుప్తుడిలా అన్ని రాసుకుంటూ ఉంటానని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. జగన్‌పై మంత్రి డీబీవీ స్వామి ధ్వజం

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

Updated Date - Feb 06 , 2026 | 04:59 PM