హార్టికల్చర్ హబ్‌కు 30వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలంతా హ్యాపీ: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:55 PM
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 14: రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం అన్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాటామంతీ జరిపారు. ఈ సంభాషణలో అమరావతి అభివృద్ధిపైనా, ప్రకాశం, రాయలసీమ అభివృద్ధి మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం ఇంకా వైసీపీ పాలనలో వచ్చిన విధ్వంసం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందన్న చంద్రబాబు.. ప్రస్తుత బడ్జెట్ మెరుగైనది అయినప్పటికీ సమస్యలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనే వారసత్వ సమస్యను కేంద్ర సహకారంతో మేనేజ్ చేస్తున్నామని తెలిపారు. అమరావతి విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ, రెండు, మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని, రాజధానిని జాతీయ రహదారులకు అనుసంధానిస్తున్నామని చెప్పారు. దీంతో రాకపోకలు పెరిగి ఆదాయం వస్తుందని వివరించారు.
రాజధాని అమరావతికి పశ్చిమ బైపాస్ వల్ల యాక్సెస్ పెరిగిందని, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్‌లతో మరింత యాక్సెస్ మెరుగుపడుతుందని సీఎం పేర్కొన్నారు. 'ఇది అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఉంటుంది. ఇది కేవలం రాజధాని నగర అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకం'. అని చంద్రబాబు చెప్పారు.
కూటమి ప్రభుత్వం అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా తీర్చిదిద్దుతోందని సీఎం తెలిపారు. ఇటీవల క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన చేసి, అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా మార్చాలనే లక్ష్యం ప్రకటించామని.. ఇది హైదరాబాద్ ఐటీ రివల్యూషన్‌తో పోల్చదగిన మరో విప్లవం అవుతుందని ఆయన అన్నారు.
ప్రపంచంలో టాప్-3 క్వాంటం వ్యాలీల్లో అమరావతి ఒకటిగా నిలవాలనేది మన దీర్ఘకాలిక దృష్టి అని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరకని రాయలసీమలో ఇప్పుడు దేశంలోనే ఉత్తమ పండ్లు (ముఖ్యంగా దానిమ్మ) పండుతున్నాయని, అప్పుడు తెచ్చిన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు.
రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు.. 500 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని, రాష్ట్రం పూర్తిగా గాడిలో పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?