ఆ కసితోనే జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Jul 30 , 2026 | 04:49 PM
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా మనల్ని గెంటి వేశారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ కసితోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
కర్నూలు, జులై 30: రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా మనల్ని గెంటేశారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ కసితోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. గురువారం కర్నూలులో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని అంటే అందులో ఆ శాఖ మంత్రి టీజీ భరత్ కృషి ఎంతో ఉందని తెలిపారు. ఓ పట్టుదలతో తామంతా పనిచేస్తున్నామని అన్నారు. రిలయన్స్, ఫార్మాతోపాటు ఇతర పరిశ్రమలు కర్నూలు జిల్లాకు వస్తున్నాయని ఆయన వివరించారు.
పట్టుదలతోపాటు క్రమశిక్షణతో పనిచేయాలని ఈ సందర్భంగా యువతకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ మూడు నెలల్లో (90 రోజుల్లో) వస్తుందని ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గతంలో తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో తనను పత్తికొండలో పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని.. కానీ ప్రజలు, కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
యువగళంలో ఇచ్చిన మాట ప్రకారం.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని భారీగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సోలార్ ప్రాజెక్టులు వస్తుంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనిట్‌పై రూ.13 పైసలు తగ్గించామన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.