శాప్ కార్యాలయం ముట్టడి కేసులో అరెస్టుల పర్వం.. 260 మంది గుర్తింపు
ABN , Publish Date - Sep 22 , 2026 | 09:02 PM
విజయవాడలోని స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం ముట్టడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నేతలు సుందరపాల్, రవిచంద్ర, సురేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ, సెప్టెంబర్ 22: నగరంలోని స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం ముట్టడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నేతలు సుందరపాల్, రవిచంద్ర, సురేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 221, 227, 223, 187, 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పలువురు వైసీపీ అగ్రనేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరో వైపు ఇదే వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ధర్నాలో ఘర్షణకు దిగిన వారిని గుర్తించే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటితోపాటు అందుబాటులో ఉన్న ఇతర వీడియో ఫుటేజ్‌ను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. మీడియా ఛానెల్స్, సోషల్ మీడియా, ఇతర వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తుల కదలికలపై పోలీసుల నిఘా ఉంచారు. వీడియో ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తుల ముఖాలు, కదలికలను ఈ సందర్భంగా పోలీసులు పరిశీలించి గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే సుమారు 260 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో 220 నుంచి 230 మంది స్పష్టమైన డిజిటల్ ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఘర్షణలకు పాల్పడిన వారిపై పక్కా ఆధారాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం వారి ఇళ్ల వద్ద, అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాల ఆధారంగా వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి భద్రపరిచారు. ఘర్షణలో ఎవరెవరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
అలాగే ఎవరెవరు రెచ్చగొట్టారనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వ్యక్తుల పాత్రను వీడియో ఆధారాలతో నిర్ధారించిన తర్వాతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం గుర్తించిన 260 మందిలో 45 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. మరో 71 మందిని ట్రబుల్ మోంజర్స్‌గా గుర్తించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 46 మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నట్లు కనుగొన్నారు. గతంలో 91 మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసుల వద్ద రికార్డుల ద్వారా స్పష్టమైంది.
ఈ ధర్నాలో 8 మంది ఎమ్మెల్సీలు, ఐదు మంది మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మేయర్లు, మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నట్లు గుర్తించారు. కంచికచర్లకు చెందిన మార్తా శ్రీనివాస్‌పై 15, వేమ సురేష్ బాబుపై 14 కేసులు రికార్డుల్లో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. తెనాలికి చెందిన గద్దేటి సురేంద్రపై 12, దేవినేని అవినాష్‌పై 13, ఆవుతు శ్రీనివాసరెడ్డిపై12, మొండితోక జగన్ మోహన్ రావుపై 11 కేసులు నమోదయ్యాయి. పలువురు రౌడీషీటర్లు, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు ఈ ధర్నాలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా