Share News

ఓడినా నిస్పృహకు గురికాని నాయకుడు వాజ్‌పేయి..: వెంకయ్యనాయుడు

ABN , Publish Date - Jan 25 , 2026 | 01:44 PM

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాలంటూ నేటితరం నాయకులకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అట్టడుగున ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేశారంటూ వాజ్‌పేయి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు..

ఓడినా నిస్పృహకు గురికాని నాయకుడు వాజ్‌పేయి..: వెంకయ్యనాయుడు
venkaiah naidu

విజయవాడ, జనవరి 25: క్యారెక్టర్, క్యాలిబర్, కండక్ట్, కెపాసిటీ ఉన్న ఏకైక నాయకుడు.. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి అని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా.. నిస్పృహకు గురికాని నాయకుడు వాజ్‌పేయి అని గుర్తు చేశారు. ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని వాజ్‌పేయి నమ్మారని వివరించారు. మూడు సార్లు ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి వాజ్‌పేయి, అద్వానీ కారణమని చెప్పారు.


వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాలంటూ మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అట్టడుగున ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేశారంటూ వాజ్‌పేయి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. బడి, గుడి, అమ్మ ఒడిలో మాతృబాషలో మాట్లాడాలని సూచించారు. ఇంగ్లీషు రాకపోతే చదువు రాదనే మాట అబద్ధమన్నారు. వీధి బడిలో చదువుకున్న తాను ఉప రాష్ట్రపతి అయ్యానని.. మాతృభాషలో చదువుకున్న వాళ్లు రాష్ట్రపతి అయ్యారని వివరించారు. ప్రభుత్వంలో పని చేసే వాళ్లు అవినీతికి దూరంగా ఉండాలని హితవు పలికారు. పేదరికాన్ని దేశంలో నిర్మూలించాలని.. అప్పుడే దేశాభివృద్ధి చెందుతోందన్నారు.


అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బలంగా, ధైర్యంగా ఉన్నప్పుడు సమాధానం అందరికీ చెప్పాల్సిన అవసరం ఏముందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. శాసన సభ్యులంతా సుజనా చౌదరిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలకు భిన్నంగా సుజనా చౌదరి ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో.. చూస్తూనే ఉన్నామన్నారు. పార్టీలు బాగుండాలంటే వారి ప్రతినిధులు బాగుండాలని చెప్పారు. చట్టసభల్లో గౌరవంగా మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో చట్టసభల పట్ల గౌరవం తగ్గిందని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు గౌరవంగా మెలుగుతూ.. పని చేయాలన్నారు. నాయకులకు సరైన మార్గదర్శనం చేయాలంటూ రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.


SIRపై అనవసర వివాదం సృష్టిస్తున్నారని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల సవరణ, మార్పులు, చేర్పులు రాజకీయ పార్టీల కార్యకర్తలు చేయడం లేదని పెదవి విరిచారు. అది మన పని కాదని కార్యకర్తలు వదిలేయడంతో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకుందన్నారు. మనం ఎంత కాలం బతికామన్నది కాదని.. ఏమి చేశామన్నదే ముఖ్యమన్నారు. తాను రిటైర్ అయ్యానని.. కానీ ఇంకా టైర్డ్ కాలేదంటూ చమత్కరించారు. ఉప రాష్ట్రపతిగా మాత్రమే తాను పదవీ విరమణ చేశాను కానీ.. పెదవి విరమణ చేయలేదంటూ వెంకయ్య నాయుడు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..

నాంపల్లి అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

For More AP News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 02:10 PM