Share News

మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Aug 04 , 2026 | 08:09 PM

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
Former Vice President Venkaiah Naidu

విజయవాడ: నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మండలి వెంకట కృష్ణారావు స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.


ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏది ప్రారంభించాలన్నా రిబ్బన్ కత్తిరించడం సరికాదన్నారు. అది బ్రిటీష్ వారు నేర్పిన విధానమని చెప్పారు. మన దేశాన్ని, మనల్ని వారు విభజించి వెళ్లారని అన్నారు. ఏదైనా ముడి వేస్తే దానిని విప్పి ప్రారంభోత్సవ సూచికగా చూడాలన్నారు. మండలి వెంకట కృష్ణారావు వంటి మహనీయుల సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. గాంధేయవాదిగా ఆయన పనితీరును చూసే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఏ శాఖ మంత్రిగా ఉన్నా ప్రతి పనిలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణకు మండలి బుద్ధప్రసాద్ కృషి చేస్తూ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.


వెంకట కృష్ణారావు జీవిత విశేషాలతో మల్లిఖార్జునరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించామని వెంకయ్య నాయుడు చెప్పారు. మహనీయుల జీవితాల్లో జరిగిన ముఖ్య ఘట్టాలను ఇటువంటి పుస్తకాల ద్వారానే నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. వెంకట కృష్ణారావు నిగర్వి, నిరాడంబరుడిగా ఉంటూనే సేవలందించారని కొనియాడారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన ఎంతో పరితపిస్తూ కృషి చేసేవారని తెలిపారు. వెంకట కృష్ణారావు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని గురువులను గౌరవించేవారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఆచార్య రంగాని అవనిగడ్డకు ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఈ రాష్ట్రంలో రాజకీయ కార్యకర్తలకు పాఠశాలలు ఏర్పాటు చేసి ఆచార్య రంగా శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. పాత రోజుల్లో కమ్యూనిస్టులు, జనసంఘ్ కూడా ఇలాగే శిక్షణ ఇచ్చేవారని అన్నారు. నేటి రోజుల్లో రాజకీయ నేతలకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.


నేడు అసెంబ్లీలో జరుగుతున్న రచ్చ, బూతులు చూస్తే ఆవేదన కలుగుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. శాసనసభలో కొంతమంది మాట్లాడుతున్న తీరును మనం గమనిస్తున్నామని చెప్పారు. అందుకే ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మన మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం కలిగి ఉండాలని, పరభాషపై గౌరవం ఉండాలని అన్నారు. గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష తెలుగు అని పేర్కొన్నారు. విదేశాల్లోనూ చాలా మంది తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడుతున్నారని తెలిపారు. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించాలంటే భాషను రక్షించుకోవడం చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ మన భాషను అలవాటు చేసుకోవాలని, మన పిల్లలకూ నేర్పించాలని సూచించారు. మాతృభాష మన కళ్లు అయితే, ఇంగ్లిష్ భాష కళ్లద్దాలు లాంటిదని అన్నారు.


'మమ్మీ, డాడీ' సంస్కృతి వదిలేసి 'అమ్మ, నాన్న' అని పిలిపించుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే ఇవ్వాలని, అది కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. అవసరమైన వారికి ఇంగ్లిష్‌లో అదనంగా కాపీలు ఇవ్వాలని సూచించారు. గతంలో ఇంగ్లిష్, ఉర్దూ వస్తేనే ఉద్యోగాలనే నిబంధన ఉండేదని.. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో తెలుగు వస్తేనే ఉద్యోగాలనే నిబంధన అమలు చేయాలన్నారు. ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేస్తేనే మన భాషను పరిరక్షించుకోవడానికి వీలు ఉంటుందని పేర్కొన్నారు. సినిమాల్లోనూ అసందర్భంగానో, ప్రాసల కోసమో ఇంగ్లిష్ పదాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రసార మాధ్యమాలూ తెలుగు భాష పరిరక్షణ కోసం పనిచేయాలని సూచించారు. ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పనిచేస్తేనే తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుందని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

ఏపీ లిక్కర్‌ స్కాం.. A9 కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈనెల 18 వరకు రిమాండ్‌

Updated Date - Aug 04 , 2026 | 08:10 PM