నాగరాజుపై సిట్ ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:43 AM
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్‌ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.
సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చాక ఏం జరిగింది?
సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది?
ఆ నేతతో సంబంధమేంటి?
సురేశ్‌కు స్టేషన్‌లో పనేంటి
రెండో రోజు మౌనం
హైకోర్టుకు నాగరాజు భార్య భవాని
విజయవాడ, జూలై 31(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్‌ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు. విజయవాడలోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నాగరాజును సిట్ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 25-30 ప్రశ్నలు అడిగారు. మే నెలలో 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు.
అసలు ఎనిమిదో తేదీన అతడిని స్టేషన్ నుంచి బయటకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని అడిగారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. సిట్ అధికారులు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నా నాగరాజు పెదవి విప్పలేదని తెలిసింది. విచారణ సమయంలో మౌనంగా ఉండడం పరిష్కారం కాదని అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్రమైన అభియోగాలు చేశారని, వాటిన్నింటికీ జవాబు చెప్పి తీరాలని కాస్త ఘాటుగానే చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాల ఫుటేజీని ఎందుకు మాయం చేయాల్సి వచ్చిందని అడిగారు. సాయికృష్ణ అదృశ్యంలో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్‌కుమార్, జంగం నాని ఏవిధంగా సహాయం చేశారని ప్రశ్నించారు.
నాయకుడితో రాయబారమా?
కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు సాయికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో వారు.. జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడిపై ఆరోపణలు చేశారు. నాగరాజు తరఫున ఆ నాయకుడు తమ ఇంటికి వచ్చాడని చెప్పారు. ఈ వాంగ్మూలం ఆధారంగా నాగరాజుకు అధికారులు ప్రశ్నలు సంధించారు. ఈ కేసుకు ఆ నాయకుడికి సంబంధం ఏమిటని అడిగారు. మీ తరఫున రాయబారిగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దీంతోపాటు సురేశ్ అనే వ్యక్తి తరచు గా స్టేషన్‌కు ఎందుకు వచ్చేవాడని, అతనికి ఇక్కడ పని ఏముంటుందని అడిగారు.
మాట్లాడనివ్వడం లేదు: న్యాయవాదులు
విచారణ ప్రక్రియలో సిట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నాగరాజు తరఫు న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విచారణ మధ్యలో న్యాయవాదులతో మాట్లాడుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందని చెబుతున్నారు. అయితే, రెండు రోజులు సాగిన విచారణలో నాగరాజుతో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని న్యాయవాదులు తెలిపారు. కనీసం మధ్యాహ్నం భోజన సమయంలో గానీ, విచారణ ముగిసిన తర్వాత గానీ ఆయనతో మాట్లాడే అవకాశం లేకుం డా పోయిందంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులతోనూ నాగరాజును మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సిట్ అధికారులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ నాగరాజు భార్య భవాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.