Strike Called Off: ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సమ్మె విరమణ
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:19 PM
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అద్దె బస్సుల యజమానులు తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువరించారు.
అమరావతి, జనవరి 09: ఆర్టీసీలో అద్దె బస్సుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సంబంధిత యాజమాన్యం ఈనెల 12 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమ్మెను విరమించుకున్నారు అద్దె బస్సుల యజమానులు. సదరు సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
తాము ప్రధానంగా ఎదుర్కొంటున్న 5 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎండీ ద్వారకా తిరుమలరావు ముందుంచారు అద్దె బస్సుల యజమానులు.
బస్సుల్లో ఓవర్ లోడ్ వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించడం.
బస్సు ప్రమాదానికి గురైనపుడు ఇచ్చే ఇన్సూరెన్స్ సమస్యలకు పరిష్కారం చూపడం.
కేఎంపీఎల్(KMPL)ను 5.77 నుంచి 5.27కు తగ్గించడం.
నిర్వహణా ఖర్చుల కోసం ఇచ్చే మొత్తాన్ని పెంచడం.
అద్దె బస్సుల వాహన కార్మికులకు ఇచ్చే వేతనాలను పెంచడం.
అయితే.. పై సమస్యలన్నింటినీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ఎండీ తిరుమలరావు చర్చించారు. అనంతరం.. ఈనెల 20లోగా సమస్యలను పరిష్కరిస్తామని అద్దె బస్సుల యజమానులకు ఎండీ హామీ ఇచ్చారు. దీంతో ఈనెల 12 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు అద్దె బస్సుల యజమానులు వెల్లడించారు. పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
ఇవీ చదవండి:
ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఆమె కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు