Share News

ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో పులి మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన...

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:21 AM

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పులిది సహజ మరణమా.. లేక వేటగాళ్ల దుశ్చర్య అనే కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో పులి మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన...
Deputy CM Pawan Kalyan

అమరావతి, ఆగస్టు 1: నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్‌ఎస్‌టీఆర్) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పులిది సహజ మరణమా, లేక వేటగాళ్ల దుశ్చర్య అనే కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశిస్తూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను పెంచాలని ఆదేశించారు.


డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్...

‘నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతం నా దృష్టికి వచ్చింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోంది. ఈ మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించాను. అది సహజ మరణమా? లేక వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించాను’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

44,89,512 ఓట్లు అవుట్!

రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 10:25 AM