పరిశ్రమలకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. 33శాతం పచ్చదనం తప్పనిసరి
ABN , Publish Date - Aug 31 , 2026 | 04:09 PM
ఏపీ ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు.
అమరావతి, ఆగస్టు 31: ఏపీ ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించే బాధ్యతను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలన్నారు.
పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం వల్ల వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని డిప్యూటీ సీఎం తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడం అందరి బాధ్యతన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి, ప్రకృతికి, రాబోయే తరాలకు విలువైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు. ఏపీవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పరిశ్రమలు 33 శాతం పచ్చదనం నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశించారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
పనులు పెండింగ్‌లో ఉండగానే జాతికి అంకితమంటూ డ్రామాలు.. జగన్‌పై నిమ్మల ఫైర్
Read Latest AP News And Telugu News