Share News

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చించిన అంశాలివే

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:47 PM

ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ సమావేశమయ్యారు.

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చించిన అంశాలివే
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, జూన్ 16: ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్‌తో పవన్ సమావేశమయ్యారు. ఏపీ అటవీ శాఖకు సంబంధించిన కీలక అంశాలు, పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఏపీకి సంబంధించిన కీలక ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలిపారు. ఏపీ అటవీ శాఖ కోసం ఏర్పాటు చేస్తున్న ‘అరణ్య భవన్’లో మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణ కేంద్రం(HANUMAN), గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ వంటి ఆధునిక సౌకర్యాల ఏర్పాటు చేయాలని కోరామన్నారు.


అటవీ ప్రాంతాల్లో పులుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను 150కు పెంచేందుకు అదనపు నిధులు కోరినట్లు పవన్ తెలిపారు. ఈ బేస్ క్యాంపుల ద్వారా సుమారు 300 మంది చెంచు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహణకు అవసరమైన మోటార్ బైకులు, డ్రై రేషన్ తదితర సౌకర్యాలకు కూడా కేంద్ర సహకారం కోరానని వెల్లడించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరగడంతో జన్యు వైవిధ్యం(DNA Diversity) కాపాడేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఆరు ఆడ పులులను తీసుకొచ్చేందుకు చర్చించామన్నారు.


గోదావరి నదిలో కాలుష్య నివారణ చర్యల కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) బృందాన్ని పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ చెప్పారు. కాలుష్య స్థాయిని అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 1,050 కిలోమీటర్ల తీరప్రాంతంలో సుమారు 450 కిలోమీటర్ల మేర మంగ్రూవ్, కాజూరినా, తాటి చెట్ల పెంపకం చేపడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సింగపూర్‌లో ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి 14 మందితో కమిటీ: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 12:53 PM