ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. సమస్యను అధిగమిస్తాం: నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:40 PM
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.
విజయవాడ, జులై 9: కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తవడంపై పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులు, రైస్ మిల్లర్లతో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యుత్తమ ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో అధికారులు బాగా పని చేశారని కొనియాడారు.
రానున్న సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని వివరించారు. రూ.31 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి, 11.53 లక్షల మంది రైతులకు 95 శాతం చెల్లింపులు 24 గంటల్లోనే చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బీపీటీ బియ్యం అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న 10 శాతం బ్రోకెన్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రతి ధాన్యం బస్తాకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, Track & Trace విధానం ద్వారా రైతు నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ వరకు పూర్తి వివరాలు తెలుసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్ ద్వారా రైతులు ధాన్యం విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు.
గన్నీ బ్యాగులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకున్నామని నాదెండ్ల తెలిపారు. ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల్లోనే గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. రవాణా జాప్యాన్ని నివారించేందుకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులను కూడా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఆర్ఎఫ్ఐడీ స్టిక్కర్లు, స్కానర్లతో లారీల కదలికలను పర్యవేక్షించే వ్యవస్థ అమలు చేస్తున్నామని చెప్పారు. తేమ కొలిచే మాయిశ్చర్ మీటర్లు అన్ని చోట్లా ఒకే కంపెనీ, ఒకే మోడల్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 90 శాతం ఏర్పాటు పూర్తవగా, ఖరీఫ్ నాటికి 100 శాతం పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో వరి ఉత్పత్తి సుమారు 15 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు ఉన్నాయన్నారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించి, అవసరమైన సూచనలు అందించి సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇక నుంచి మీ సంగతి చూస్తాం... కొడాలి నానికి బుద్దా వెంకన్న వార్నింగ్
కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News