Share News

కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:36 PM

సంప్రదాయ కళలను పరిరక్షించడం అంటే వాటిని ప్రోత్సహించడం మాత్రమే కాదని, వాటిని జీవనాధారంగా చేసుకున్న కళాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Deputy CM Pawan Kalyan

అమరావతి, జులై 9: సంప్రదాయ కళలను పరిరక్షించడం అంటే వాటిని ప్రోత్సహించడం మాత్రమే కాదని, వాటిని జీవనాధారంగా చేసుకున్న కళాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా హస్తకళాకారులు, చేనేత కార్మికులతో మాట్లాడిన సమయంలో వారు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. హస్తకళా మహోత్సవం సందర్భంగా హస్తకళాకారులు, చేనేత కార్మికులతో ఆత్మీయంగా మమేకమయ్యే అవకాశం లభించిందన్నారు. వారి అసాధారణ నైపుణ్యం, అపారమైన ఓర్పు, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న కళాకారులు వెన్ను, మెడ, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తమ చేతుల మీద మోస్తున్న కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత అని బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.


కళాకారుల సమస్యలను తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి రాష్ట్రంలోని వివిధ హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులు, పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురం క్రోషే లేస్ కళాకారుల కోసం నిన్న(జులై 8న) వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించినట్లు పవన్ చెప్పారు. ఈరోజు(గురువారం)జులై 9న ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి బొమ్మల కళాకారులు, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ చేనేత కార్మికులు, కడప జిల్లాలోని మాధవరం చేనేత కార్మికులు, అనంతపురం జిల్లాలోని యాడికి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


జులై 10న విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వీణ కళాకారులు, అనకాపల్లి జిల్లాలోని ఎటికొప్పాక కళాకారులు, ఏలూరు జిల్లాలోని హ్యాండ్ నాటెడ్ వూలెన్ పైల్ కార్పెట్ కళాకారులు, మదనపల్లె చేనేత కార్మికుల కోసం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే, జులై 11న సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులు, శ్రీకాకుళం జిల్లాలోని బుడితి ఇత్తడి కళాకారులు, కృష్ణా జిల్లాలోని పెడన బ్లాక్ కలంకారీ కళాకారులు, తిరుపతి జిల్లాలోని చెక్క శిల్ప కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


ఏపీలోని మరిన్ని హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ఇదే తరహాలో వైద్య శిబిరాలను దశలవారీగా కొనసాగిస్తామని పవన్ చెప్పారు. ఈ శిబిరాల ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన చోట నిపుణుల వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, తదుపరి చికిత్సకు అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి హస్తకళాకారుడు, ప్రతి చేనేత కార్మికుడు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘కళను గౌరవించడం అంటే కళాకారుడి శ్రమను గౌరవించడం. కళాకారుడి శ్రమను గౌరవించడం అంటే ఆయన ఆరోగ్యాన్ని కాపాడటం. కళాకారులు ఆరోగ్యంగా ఉంటేనే మన సంప్రదాయాలు, వారసత్వం భావితరాలకు సజీవంగా నిలుస్తాయి. కళను కాపాడాలంటే.. ముందు కళాకారుడిని కాపాడాలి’ అని ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నా కూతురిని అల్లుడే చంపాడని నమ్ముతున్నాం: రాధా గాయత్రి తల్లిదండ్రులు

ఇక నుంచి మీ సంగతి చూస్తాం... కొడాలి నానికి బుద్దా వెంకన్న వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 02:03 PM