ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:59 PM
ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.
ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26: జి.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(MLA Vasantha Krishna Prasad) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగది, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించారు ఎమ్మెల్యే. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. ‘రోజూ భోజనం బాగుంటుందా? కడుపునిండా మెనూ ప్రకారం అన్నం పెడుతున్నారా?’ అని విద్యార్థులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతిరోజూ భోజనం బాగానే ఉంటుందని విద్యార్థులు సమాధానం ఇచ్చారు.
అయితే కూరలో ఉప్పు కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే.. రుచి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వంట నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఇకపై పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని వంట నిర్వాహకులు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితబోధ చేశారు.
భోజనశాల, క్రీడా మైదానం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్రీడా సామాగ్రి, ఆట వస్తువులను ఆయన పరిశీలించారు. పాఠశాల ఆవరణతో పాటు మొత్తం ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మరో వారం రోజుల్లో మళ్లీ పాఠశాలను తనిఖీ చేసి, పాఠశాల సమగ్రాభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ
Read Latest AP News And Telugu News