ఒక మనిషి త్యాగం ఒక జాతి గౌరవం.. ఒక రాష్ట్రం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:41 PM
అమరావతిలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అమరావతి, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో 58 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్(Minister Lokesh) పాల్గొని ప్రసంగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని మంత్రి సంబోధించారు. ‘ఒక మనిషి త్యాగం ఒక జాతి గౌరవం. ఒక మనిషి మరణం ఒక రాష్ట్రం’ అని అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్నారు. ‘అమరజీవి... చిరంజీవి’ అని పేర్కొన్నారు. ఈ విగ్రహానికి ‘ఏపీ ఆత్మగౌరవం స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’ అనే పేరు పెట్టాలని కోరినట్లు లోకేశ్ తెలిపారు.
యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరులను కలసి హామీ ఇచ్చానని.. ‘అమరావతిలోనే పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పి.. చేసి చూపించాం’ అని మంత్రి గుర్తుచేశారు. ఒక రోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతామని... కానీ తెలుగు ప్రజల కోసం, జాతి కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేశారన్నారు. ఈ చరిత్రను భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశామని వెల్లడించారు. అనుకున్న సమయానికి విగ్రహం సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.
ఆర్యవైశ్య సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం క్యాబినెట్‌లో చెప్పానని లోకేశ్ పేర్కొన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం అమరజీవి కృషి చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే యువగళం పాదయాత్ర చేశానని చెప్పుకొచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొదటి అడుగు ఆయనే వేశారన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో ఒక కాయిన్ రిలీజ్ చేయాలని కోరానని.. కేంద్రంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
240 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు.. ప్రజలే ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే
పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం: హోంమంత్రి అనిత
Read Latest AP News And Telugu News